టీఎన్‌సీసీలో గ్రామ కమిటీలు
● 12 వేల గ్రామాలలో ఏర్పాటుకు నిర్ణయం ● రంగంలోకి ఇన్‌చార్జ్‌లు
సాక్షి, చైన్నె: పార్టీ బలోపేతం దిశగా రాష్ట్రంలో మళ్లీ గ్రామ కమిటీల ఏర్పాటుకు టీఎన్‌సీసీ నిర్ణయించింది. గ్రామ స్థాయిలో పటిష్ట వంతంగా కేడర్‌ను తీర్చిదిద్దే విధంగా ఈ కమిటీల ఏర్పాటుకు ఇన్‌చార్జ్‌లను నియమిస్తూ ఆదివారం టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై ఆదేశాలు ఇచ్చారు. వివరాలు.. తమిళనాడు కాంగ్రెస్‌లోని గ్రూపులకు కొదవ లేదు. ఆయా గ్రూపులు పదవులను వాటాలు వేసుకుని పంచుకోవడం జరిగేది. ఈ పద్ధతిని మార్చే దిశగా కొత్త అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై వ్యూహాలకు పదును పెట్టారు. గ్రూపులకు అతీతంగా పార్టీ కోసం శ్రమిస్తున్న వారిని గుర్తించి జిల్లాల అధ్యక్షులు, ఇతర కమిటీ ఎంపికకు కసరత్తులలో ఉన్నారు. అదే సమయంలో గ్రామస్థాయిలో పార్టీని పటిష్టం చేయడం లక్ష్యంగా గ్రామ కమిటీల మీద దృష్టి పెట్టారు. గ్రామాలలో గతంలో కాంగ్రెస్‌కు అధిక పట్టు ఉండడం, దీనిని మళ్లీ చేజిక్కించుకునే విధంగా గ్రామ కమిటీల ఏర్పాటుకు కసరత్తులు చేపట్టారు. ఈ ప్రక్రియకు ఈనెల 5న లాంఛనంగా శ్రీకారం చుట్టారు. గ్రామ కమిటీలో ఒక అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, ఒక ప్రధాన కార్యదర్శి, ఒక కోశాధికారిగా ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలోని 12 వేల గ్రామాలలో ఈ కమిటీలను ఈ డిసెంబరు మూడో వారంలోపు ఏర్పాటు చేయడానికి కార్యాచరణ సిద్ధంచేశారు. ఇందులో భాగంగా ఈకమిటీల ఎంపిక తదితర ప్రక్రియలను పర్యవేక్షించేందుకు ఇన్‌చార్జ్‌లను రంగంలోకి దించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరంగా ఉన్న అన్ని జిల్లాలకు ఇన్‌చార్జ్‌లుగా మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలను నియమిస్తూ చర్యలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment