అన్నాడీఎంకే బ్రహ్మాస్త్రం రెండాకులు
సాక్షి, చైన్నె: దివంగత సీఎం ఎంజీఆర్ సతీమణి జానకీ ఎంజీఆర్ శత జయంతి ఉత్సవాలు అన్నాడీఎంకే నేతృత్వంలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు కోలాహలంగా నిర్వహించారు. పండుగ తరహాలో చైన్నె శివారులోని వానగరం శ్రీవారు వెంకటాచలపతి ప్యాలెస్ వేదికగా ఈ కార్యక్రమం సాగింది. జానకీ ఎంజీఆర్‌తో కలిసి సినిమాలలో నటించిన వెన్నిరాడై నిర్మల, సచ్చు, కుట్టి పద్మిని తదితరులను ఈ వేడుకల్లో భాగంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి సత్కరించారు. అన్నాడీఎంకే చరిత్ర, ఎంజీఆర్ జీవిత భాగస్వామిగా, సంక్లిష్ట పరిస్థితులలో సీఎంగా జానకి ప్రయాణం గురించి రూపకల్పన చేసిన లఘుచిత్రాన్ని ఇందులో ఆవిష్కరించారు. సినీ నటుడు తంబిరామయ్య రచయితలు ముత్తయ్య తదితరులు, ప్రముఖులు ఎందరో తమ ప్రసంగాలలో జానకీ సేవలను గుర్తు చేశారు. మరెందరో ఆమెతో ఉన్న అనుబంధం, రామాపురం తోట్టంకు వస్తే కడుపు నిండే అన్నం పెట్టి పంపించే ఆమె మాతృత్వ హృదయం గురించి వివరించారు. అలనాటి సినీ నటి జయచిత్ర, నటి గౌతమి, గాయత్రి రఘురాం వంటి వారు మాతృ మూర్తిగా ఆకలితో వచ్చేవారికి కడుపు నింపే జానకి ప్రయాణాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా అన్నాడీఎంకేను బలోపేతం చేద్దామని, విజయం వైపుగా నడిపిద్దామని దివంగత సీఎం ఎంజీఆర్ సందేశాన్ని ఏఐ టెక్నాలజీ ద్వారా ప్రదర్శించారు. చివరగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామి ప్రసంగిస్తూ దివంగత ఎంజీఆర్, జానకీ అమ్మ సేవలు, దివంగత సీఎం జయలలితలు పార్టీ కోసం పడ్డ కష్టాలు, శ్రమను గుర్తుచేస్తూ, విజయం వైపుగా దూసుకెళ్దామని పిలుపు నిచ్చారు.
బ్రహ్మాస్త్రం..
జానకీ ఎంజీఆర్ సేవలను, ఆమె సినీ ప్రయాణం, రాజకీయం గురించి అనేకమంది వీడియో సందేశాన్ని ఇచ్చారు. ఇందులో దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ప్రసంగం అన్నాడీఎంకే వర్గాలలో మరింత జోష్ నిపింది. ఈ వేడుకకు స్వయంగా హాజరు కావాలని కడంబూరు రాజు తనను ఆహ్వానించారని గుర్తు చేస్తూ ప్రసంగాన్ని రజనీకాంత్ మొదలెట్టారు. మరుదనాట్టు ఇలవరసి చిత్రంలో నటించే సమయంలో ఎంజీఆర్‌తో ప్రేమలో జానకి అమ్మ పడ్డారని ఆయన్ని మనువాడారని గుర్తు చేశారు. ఎంజీఆర్ సాధారణ మనిషి కాదన్న విషయాన్ని ఆమె అప్పట్లోనే గుర్తించారని వ్యాఖ్యలు చేశారు. సినీ రంగంలో ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు సినీ జీవితాన్ని త్యాగం చేసి ఎంజీఆర్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారని పేర్కొన్నారు. చివరి వరకు ఎంజీఆర్‌కు అండగా ఉన్నారని. రామాపురం తోట్టంకు ఎవ్వరూ వెళ్లినా కడుపు నిండా అన్నం పెట్టే తల్లి ఆమె అని కొనియాడారు. అది శాఖాహారమైనా సరే.. మాంసాహారమైనా సరే రోజూ 300 మందికి అన్నం పెట్టకుండా ఉండే వారు కాదన్నారు. ఎంజీఆర్ మరణంతో చోటు చేసుకున్న పరిణామాలను గుర్తు చేస్తూ, కేడర్, ప్రజల సంక్షేమార్థం పార్టీని వదిలి పెట్టారన్నారు. దివంగత జయలలిత నేతృత్వంలో పార్టీ వ్యవహారాలు సాగే విధంగా ఆమె తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించారు. తాను మూడు సార్లు నేరుగా జనకి అమ్మను కలిశానని, రాఘవేంద్ర సినిమా షూటింగ్‌లో ఓ మారు, సీఎం అయ్యాక రెండో సారి అని వివరించారు. మూడోసారి తనను పిలిచి ఆమె మాట్లాడారని, ఆమె తనకు కాఫీ ఇచ్చారని గుర్తు చేస్తూ, సినిమాలలో సిగరేట్ తాగే సన్నివేశాలను పక్కన పెట్టాలని దివంగత నేత ఎంజీఆర్ చెప్పిన ట్టుగా తన దృష్టికి తెచ్చారని వ్యాఖ్యలు చేశారు. ఆమె రాజకీయాలలో రావడం హఠాత్తుగా జరిగిందని, పార్టీ చీలిన సమయంలో తీసుకున్న నిర్ణయం ఆమె మంచి మనస్సుకు నిదర్శనం అని పేర్కొన్నారు. అన్నాడీఎంకేకు రెండాకుల చిహ్నం బ్రహ్మాస్త్రం అంటూ.. శతజయంతి ఉత్సవాలను నిర్వహించిన పళణి స్వామికి ధన్యవాదాలు తెలిపారు.
రజనీకాంత్ వ్యాఖ్య కోలాహలంగా జానకీ ఎంజీఆర్ శత జయంతి వేడుక నటీ నటులకు ఘన సత్కారం ఏఐ టెక్నాలజీతో ఎంజీఆర్ ప్రత్యేక ప్రసంగం
తీపి గుర్తు..
డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ మాట్లాడుతూ, విజయకాంత్‌తో తన వివాహం జరగగానే నేరుగా రామాపురం తోట్టంకు వెళ్లామని, అక్కడ ఎంజీఆర్, జానకమ్మ వద్ద ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు. ఇది జీవితంలో తీపి గుర్తు అని, మరవలేని క్షణం ఆ రోజు అని వ్యాఖ్యానించారు. ఎంజీఆర్, జనకీ అమ్మ ఇద్దరు మరణించే వరకు తమ మీద ప్రత్యేక అభిమానం చూపించారని తెలిపారు. అమెరికాకు వెళ్లి రాగానే, తనకు వాచీ కొని తెచ్చారని ఇది మరో తీపి గుర్తు అని వివరించారు. ఎంజీఆర్ స్మారకంగా తన వద్ద ఒక కోటు, ఆయన ఉపయోగించిన ప్రచారం రథం భద్రంగా ఉన్నట్టు తెలిపారు.
అన్నాడీఎంకేకు రెండాకుల చిహ్నం బ్రహ్మాస్త్రం అని దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీ కాంత్ వ్యాఖ్యానించారు. జానకీ ఎంజీఆర్ శత జయంతి వేడుక సందర్భంగా ప్రత్యేకంగా తన సందేశాన్ని వీడియో రూపంలో ఆయన అభిమానులతో పంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment