కమ్ముకున్న మేఘాలు
● బలపడనున్న ద్రోణి ● నేటి నుంచి భారీ వర్షాలు ● సముద్ర తీర జిల్లాలో అలర్ట్
సాక్షి, చైన్నె: రాష్ట్రంలోని సముద్ర ప్రభావిత జిల్లాలకు వరుణగండం పొంచి ఉంది. ఆయా జిల్లాల్లో ఆదివారం ఆకాశం మేఘావృతంగా మారింది. సోమవారం నుంచి కొన్ని చోట్ల అతి భారీగా, మరికొన్ని చోట్ల భారీగా, ఇంకొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో సముద్ర తీర జిల్లాలో అలెర్ట్ ప్రకటించారు. వివరాలు.. దక్షిణ అండమాన్ తీరంలోని బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి బల పడనుంది. ఇది మరికొన్ని గంటలలో వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇది వాయువ్య దిశలో తమిళనాడు – శ్రీలంక వైపుగా కదులుతోంది. తుపాన్‌గా విశ్వరూపం దాల్చే అవకాశం కూడా ఉంది. ఈ ప్రభావంతో సోమవారం నుంచి రాష్ట్రంలో వర్షాలు తీవ్రం కానున్నాయి. తూర్పు – ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి కన్యాకుమారి తీరం వరకు ఉపరితల ఆవర్తనం సైతం నెలకొని ఉండడంతో ఆకాశాన్ని మేఘాలు కప్పేసినట్టుగా పరిస్థితులు సముద్ర తీర జిల్లాలో నెలకొన్నాయి. చైన్నె నుంచి కన్యాకుమారి వరకు ఉన్న అన్ని తీర జిల్లాలో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశాలు అధికంగానే ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. సోమవారం మైలాడుతూరై, తంజావూరు, తిరువారూర్ , నాగపట్నం జిల్లాలో అనేక చోట్ల భారీగా, కడలూరు, పుదుకోట్టైతో పాటు మరో 6 జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. 26, 27 తేదీలలో ఈ జిల్లాలో పాటు చైన్నె, శివారు జిల్లాలో వర్షాలు అనేక చోట్ల పడనున్నాయి. తుపాన్ తీవ్ర రూపం చాల్చి తమిళనాడు వైపుగా చొచ్చుకు వచ్చిన పక్షంలో సముద్ర తీర జిల్లాలన్నీ భారీ నుంచి అతి భారీ వర్షాలను ఎదుర్కొనేందుకు అవకాశాలు ఉండడంతో అన్ని జిల్లాల అధికార యంత్రాంగం అలెర్ట్ అయింది. సముద్ర తీర వాసులను అప్రమత్తం చేస్తున్నారు. జాలర్ల గ్రామాల ప్రజలకు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితులు నెలకొన్న పక్షంలో తక్షణం శిబిరాలకు వచ్చేయాలని ఆదేశిస్తూ, ముందు జాగ్రత్తలను విస్తృతం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment