● తల్లి, ఇద్దరు కొడుకులు మృతి
అన్నానగర్: తమాల్ సమీపంలో బుధవారం సాయంత్రం బైకు– కంటైనర్ ఢీకొనడంతో తల్లి, ఇద్దరు కుమారులు మృతి చెందారు. వివరాలు.. రాణిపేట జిల్లాలో వాలజాపేట పక్కనే చెన్నా సముద్ర మనల్మేడు ప్రాంతానికి చెందిన సేటు (45) హోటల్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఇతని భార్య గజలక్ష్మి (40). వీరికి మదన్ (20), మనోజ్ (18) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో మదన్ ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. మనోజ్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాంచీపురం సమీపంలోని తిరుపుకుళీ గ్రామంలో ఆయన బంధువుల ఇంట్లో జరిగిన సంతాప కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం నలుగురూ వెళ్లారు. సంతాప కార్యక్రమం ముగియగానే సాయంత్రం మదన్, తల్లి గజలక్ష్మి, సోదరుడు మనోజ్ బైకు పై చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై ఓటేరికి వెళ్తున్నారు. మదన్ బైకును నడిపాడు. చైన్నె–బెంగళూరు జాతీయ రహదారి తామల్ గ్రామ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా వెనుక వేగంగా వచ్చిన కంటైనర్ బైకును ఢీకొట్టింది. బైకుపై వెళ్తున్న తల్లీ, కొడుకులిద్దరూ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయారు. తర్వాత కంటైనర్ చక్రంలో ఇరుక్కుని చాలా అడుగుల మేర ఈడ్చుకెళ్లారు. దీంతో మనోజ్, గజలక్ష్మి అక్కడికక్కడే నుజ్జునుజ్జై మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మదన్‌ను స్థానికులు రక్షించి కాంచీపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స ఫలించక మదన్ కూడా మృతి చెందాడు. అంత్యక్రియల ఇంటి నుంచి కొంత సమయం తరువాత, సేట్టు బైకులో బయలుదేరాడు. థమల్ సమీపంలోకి వెళ్తుండగా ప్రమాదంలో మృతి చెందిన భార్య, కుమారులను చూసిన ఘటన స్థలంలోనే బోరున విలపించాడు. ఈ ఘటన అందరిని కంట తడి పెట్టించింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదంలో మృతి చెందిన గజలక్ష్మి, మనోజ్, మదన్ మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కాంచీపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన కంటైనర్ లారీని సీజ్ చేశారు. పారిపోయిన డ్రైవర్ కోసం పోలీసులు వెతుకుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment