సమాన అవకాశాల కోసం పోటీ పడాలి
● త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి
కొరుక్కుపేట: మహిళలు తమ సామర్థ్యాన్ని గ్రహించాలని త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్ ఇంద్రసేనా రెడ్డి అన్నారు. వృత్తిపరమైన, వ్యక్తిగత రంగాలలో సమాన అవకాశాల కోసం పోటీ పడాలని ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు చైన్నెలోని శ్రీ కన్యకాపరమేశ్వరీ మహిళా కళాశాల ఆధ్వర్యంలో ప్రత్యేక మహిళా సాధికారత కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసేనా రెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు . ముందుగా స్వాగతోపన్యాసంను ఎస్‌కేపీడీ ట్రస్టీ ఎస్‌ఎల్ సుందర్శనం చేయగా, ముఖ్యఅతిథిని మరో ట్రస్టీ సీఆర్ కిషోర్ బాబు సభకు పరిచయం చేశారు. సభకు అధ్యక్షతన వహించిన కళాశాల కరస్పాండెంట్ వూటుకూరు శరత్‌కుమార్ ఎస్‌కేపీడీ అండ్ చారిటీస్ చేపడుతున్న కార్యకలాపాలను, మహిళల విద్య, సాధికారత రూపొందించటంతో పాత్రను చక్కగా వివరించారు. అనంతరం యంగ్ ఇండియన్స్ సహకారంతో ఎస్‌కేపీసీ విద్యార్థులందరూ అత్యవసర ప్రతిస్పందనదారులుగా శిక్షణ పొందారు. ఆ శిక్షణ పూర్తి చేసిన విద్యార్థినులను యాక్సిడెంట్ ఫస్ట్ రెస్పాండర్ ప్రోగ్రామ్ సర్టిఫికెట్‌లను త్రిపుర గవర్నర్ ఎన్ ఇంద్రసేనా రెడ్డి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. లక్ష్యాలను నిర్ధేశించుకుని విద్యార్థినులు ఆ దిశగా చదువుల్లో రాణించాలని సూచించారు. వృత్తిపరమైన, వ్యక్తిగత రంగాలలో సమాన అవకాశాల కోసం పోటీ పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డిని ఎస్‌కేపీడీ ట్రస్టీలు ఘనంగా సత్కరించారు. ఇందులో ఎస్‌కేపీడీ ధర్మకర్త కొల్లా వేంకట చంద్రశేఖర్, సెక్రటరీ ఎం. కిషోర్‌కుమార్ ఇంకా మాజీ ట్రస్టీ మన్నారు ఉదయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment