ఐటీఐల్లో అడ్మిషన్లు 95 శాతం దాటాయి..!
● విద్యాశాఖ వెల్లడి
కొరుక్కుపేట: తమిళనాడు వ్యాప్తంగా ఐటీఐల్లో నమోదు 95 శాతం దాటిందని విద్యాశాఖ అధికారులు తెలిపారు.తమిళనాడులో ఉపాధి శిక్షణ కేంద్రం కింద 102 ప్రభుత్వ వృత్తి శిక్షణా కేంద్రాలు, 311 ప్రైవేట్ వృత్తి శిక్షణ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇందులో 2024–2025 సంవత్సరానికి విద్యార్థుల అడ్మిషన్ గడువును విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఇటీవల పొడిగించారు. కాగా కొత్త కోర్సుల ప్రవేశంతో ఐటీఐల్లో విద్యార్థుల నమోదు 95 శాతం దాటిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్మిక సంక్షేమం అండ్ నైపుణ్యాభి వృద్ధి శాఖ సీనియర్ అధికారి మాట్లాడుతూ ప్రభుత్వ ఐటీఐలు, 36 ఇంజినీరింగ్ విభాగాల్లో దీర్ఘకాలిక నైపుణ్య శిక్షణను అందిస్తాయని పేర్కొన్నారు. వెల్డర్, బిట్టర్, టర్నర్, లాజిస్టిక్స్ అసిస్టెంట్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్, మెడికల్ ఎలక్ట్రానిక్స్, ఆపరేటర్ అడ్వానన్స్‌డ్ మెషిన్ టూల్స్, ఇండస్ట్రియల్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ వంటి రెగ్యులర్ కోర్సులతో పాటు, కొత్త ట్రేడ్ కోర్సులకు కూడా శిక్షణ ఇవ్వబడుతుందన్నారు. ఇక విద్యార్థినుల కోసం మొత్తం 14 ఐటీఐలు ఉన్నాయని, 2023–2024లో 96 శాతం మంది మహిళలు అడ్మిషన్లు పొందారని, 2024–2025కి ఇది 100 శాతానికి చేరుతుందని ఆయన అభిప్రాయడ్డారు.
డిసెంబర్ 8న
‘ధ్యాన యోగం’పై పోటీలు
కొరుక్కుపేట: శ్రీమత్ భగవద్గీత జయంతిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో డిసెంబరు 8న చిన్నారులకు ‘ద్యాన యోగం – 6వ అధ్యాయం’పై పోటీలు జరుగనున్నాయి. చైన్నె టి.నగర్ వెంకటనారాయణ రోడ్డులో ఉన్న శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ఉదయం 9గంటల నుంచి పోటీలు ప్రారంభమవుతాయి. అదేరోజు సాయంత్రం 4 గంటలకు బహుమతులను ప్రదానం చేస్తున్నట్టు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ధ్యాన యోగంపై గ్రూప్–1లో 6, 7 తరగతులకు, గ్రూప్–2లో 8, 9 తరగతులకు పోటీలు ఉంటాయి. అలాగే భగవద్గీతలోని 18 అధ్యాయాలపై గ్రూప్–1లో 18 సంవత్సరాల్లోపు, గ్రూప్–2లో 18 ఏళ్ల పైబడిన వారికి పోటీలు ఉంటాయని మరిన్ని వివరాలకు 9444019640 నంబర్‌ను సంప్రదించవచ్చని నిర్వాహకులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
దైవానై మృతులకు
రూ. 10 లక్షలు నష్ట పరిహారం
సేలం : తిరుచెందూరు ఆలయ ఏనుగు దైవానై దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు మంత్రి శేఖర్ బాబు ఆదివారం నష్టపరిహారంగా తలా రూ. 10 లక్షల చెక్కులను అందజేశారు. తిరుచెందూర్ సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఈనెల 18వ తేదీన ఆలయ ఏనుగు దైవానై దాడిలో మావటి ఉదయకుమార్, అతని బంధువు శిశుపాలన్ మృతి చెందారు. ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి స్టాలిన్ తన సంతాపాన్ని తెలుపుతూ నష్టపరిహారాన్ని అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ స్థితిలో దేవదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు ఆదివారం తిరుచెందూరు ఆలయానికి వెళ్లారు. అక్కడ ఆలయ ఏనుగు దైవానైను సందర్శించారు. దానికి ఆరోగ్య స్థితి, అందించే ఆహారం వంటి విషయా గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆలయంలోపలికి వెళ్లి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకున్నారు. అనంతరం ఏనుగు మావటి ఉదయకుమార్ ఇంటికి వెళ్లి ఆయన భార్య రమ్య, శిశుపాలన్ కుమార్తె అశ్వినిని ఓదార్చారు. వారికి నష్టపరిహారంగా సీఎం నివారణ నిధి నుంచి రూ. 2 లక్షలు, ఆలయ నిధి నుంచి రూ. 5 లక్షలు, తక్కర్ అరుళ్ మురుగన్ తరపున రూ. 3 లక్షలు అంటూ తలా రూ. 10 లక్షల చెక్కులను అందజేశారు.
సేలంలో ‘హ్యాపీనెస్ వాల్’
సేలం : సేలంలో ప్రభుత్వ ఆసుపత్రి ప్రహరీ గోడపై ‘హ్యాపీనెస్ వాల్’ పెయింటింగ్ పోటీలు ఆదివారం నిర్వహించారు. సేలం ప్రభుత్వ మోహన్ కుమారమంగళం మెడికల్ కళాశాల ఆసుపత్రి ప్రహరీ గోడపై ప్రైవేట్ స్వచ్ఛంద సేవా సంస్థలు ఆరోగ్యం, రోడ్డు భద్రత, పిల్లల భద్రత, మానసిక ఆరోగ్యంతో పాటు పలు సామాజిక అంశాలపై అవగాహన పెయింటింగ్ పోటీలు ఏర్పాటు చేశారు. ఇందులో 10కి పైగా పాఠశాలలు, కళాశాలలకు చెందిన 150 మందికి పైగా విద్యార్థులు పాల్గొని అవగాహన పెయింటింగ్స్ వేశారు.
Comments
Please login to add a commentAdd a comment