మార్చి నాటికి ‘తిరుమలిసై’ సిద్ధం
● బ్రహ్మాండంగా రూపుదిద్దుకుంటున్న బస్ టెర్మినల్ ● కొంగు మండలం, కర్ణాటక వైపుగా వెళ్లే బస్సులన్నీ ఇక్కడే
సాక్షి, చైన్నె: చైన్నె శివారులోని తిరుమలిసై కుత్తంబాక్కం సబర్బన్ బస్ టెర్మినల్ మార్చి నాటికి సిద్ధం కానుంది. దీన్ని ప్రస్తుతం బ్రహ్మాండంగా నిర్మిస్తున్నారు. వివరాలు.. చైన్నె నగరంలోని కోయంబేడు బస్ టెర్మినల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ ట్రాఫిక్ పద్మ వ్యూహాన్ని దృష్టిలో ఉంచుకుని నగర శివారుల నుంచి బస్సుల సేవలు జరిగే రీతిలో సబర్బన్ టెర్మినల్స్ పేరిట నిర్మాణాలను చైన్నె మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ చేపట్టింది. తొలుత చైన్నెకు ఉత్తర దిక్కున మాధవరం వద్ద సబర్బన్ టెర్మినల్ నిర్మించారు. ఇక్కడి నుంచి ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల వైపుగా వెళ్లే బస్సులను నడుపుతూ వస్తున్నారు. చైన్నెకి దక్షిణ దిక్కున కిలాంబాక్కంలో మరో టెర్మినల్ రూపుదిద్దుకుంది. ఇక్కడి నుంచి దక్షిణ తమిళనాడు, డెల్టా జిల్లాల వైపుగా అన్ని రకాల బస్సుల సేవలు అందుతున్నాయి. ఇక్కడికి కూత వేటు దూరంలో ఆమ్నీ ప్రైవేటు బస్ టెర్మినల్ సైతం రూపుదిద్దుకుంటోంది. సంక్రాంతిలోపు ఈ ఆమ్నీ ప్రైవేటు బస్ టెర్మినల్ ఉపయోగంలోకి రానుంది. అదే సమయంలో పశ్చిమ దిక్కున ఎక్స్‌ప్రెస్ వే (ఔటర్ రింగు రోడ్డు)ను అనుసంధానిస్తూ చైన్నె – బెంగళూరులో జాతీయ రహదారిలోని తిరుమలిసై సమీపంలోని కుత్తంబాక్కంలో మరో సబర్బన్ బస్ టెర్మినల్‌పై దృష్టి పెట్టారు.
మార్చి నాటికి ఉపయోగంలోకి..
సేలం, కోయంబత్తూరు, తిరుప్పూర్ తదితర కొంగు మండలంలోని ఎనిమిది జిల్లాలు, వేలూరు మీదుగా కర్ణాటక రాష్ట్రం వైపుగా వెళ్లే అన్ని రకాల బస్సుల సేవలు, కేరళ వైపుగా వెళ్లే బస్సులు తిరుమలిసై కుత్తంబాక్కం నుంచి చేపట్టే రీతిలో కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందుకు అనుగుణంగా రూ. 424 కోట్లతో సుమారు 25 ఎకరాల స్థలంలో బ్రహ్మాండ బస్ టెర్మినల్ ప్రస్తుతం రూపుదిద్దుకుంటోంది. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ 70 ప్రభుత్వ, 30 ప్రైవేటు ఆమ్నీ బస్సులు నిలిపే విధంగా ప్లాట్ ఫాంలు ఏర్పాటు చేశారు. అలాగే శివారు ప్రాంతాలు, నగరం వెళ్లే బస్సుల కోసం 37, ప్రైవేటు బస్సుల కోసం 27 ప్లాట్ ఫామ్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. రెండు అంతస్తులతో బస్ టెర్మినల్ రూపదిద్దుకుంటోంది. బస్ డిపో సైతం ఇక్కడ ఏర్పాటు చేయడమే కాకుండా, 14 లక్షల లీటర్ల మేరకు వర్షపు నీటి సేకరణ నిమ్తితం ప్రత్యేక ట్యాంక్‌ల ఏర్పాటు పనులు ముగింపు దశకు చేరాయి. అన్ని రకాల సౌకర్యాలే కాకుండా, ఎలక్ట్రికల్ వాహనాలకు విద్యుత్ చార్జింగ్ స్టేషన్ , 1250 ద్విచక్ర వాహనాలు, 235 నాలుగు చక్రాల వాహనాలు నిలుపుదల చేసే విధంగా పార్కింగ్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. పనుల వేగంపెంచే విధంగా కాంట్రాక్టర్లకు సీఎండీఏ వర్గాలు సూచిస్తూ వస్తున్నాయి. మార్చి నుంచి ఈ బస్ టెర్మినల్ ద్వారా బస్సుల సేవలు జరిగి తీరాలనే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. అన్ని రకాల నిర్మాణల పనులు ముగింపు దశకు చేరినా, మెరుగులు దిద్దే పనులు పూర్తికావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment