సభా పర్వానికి సన్నద్ధం
● డిసెంబరు 9 నుంచి సమావేశాలు ● స్పీకర్ అప్పావు ప్రకటన
సాక్షి, చైన్నె: అసెంబ్లీ సమావేశాలకు స్పీకర్ అప్పావు చర్యలు తీసుకున్నారు. డిసెంబరు 9వ తేదీ నుంచి ఈ సమావేశాలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందుగా రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ దాఖలు జరిగింది. ఎన్నికల తేదీ సమీపించడంతో నాలుగు రోజులలో సభను మమా అనిపించారు. ఎన్నికలలో డీఎంకే కూటమి రాష్ట్రంలోని అన్ని స్థానాలను క్లీన్‌స్వీప్ చేసింది. ఎన్నికల అనంతరం జూన్‌లో 20వ తేదీ నుంచి జూలై 29వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగింది. ఇందులో శాఖల వారీగా నిధుల కేటాయింపు తదితర అంశాలపై చర్చ జరిగింది. అనంతరం సభను స్పీకర్ వాయిదా వేశారు. ప్రస్తుతం శీతాకాల సమావేశాలపై దృష్టి పెట్టారు. డిసెంబరు 9వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని స్పీకర్ అప్పావు సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు. ఉదయం 9.30 గంటలకు సభ ప్రారంభం అవుతుందని వివరించారు. అనంతరం జరిగే సభా వ్యవహారాల కమిటీ సమావేశంలో సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలో అన్న విషయంగా, కీలక అంశాలు, తీర్మానాలు, ముసాయిదాల గురించి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అసెంబ్లీ సమావేశాలను దశల వారీగా ప్రత్యేక్ష ప్రసారం చేస్తున్నామని, ఇది కొనసాగుతుందన్నారు. కాగితరహిత సమావేశాలు జరుగుతూ వస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఏఐ టెక్నాలజీని కూడా అవసరమైతే ఉపయోగించుకుంటామన్నారు. సభా హక్కుల ఉల్లంఘనకు సంబంధించి క్రమ శిక్షణా కమిటీ ద్వారా అవసరమైన సందర్భాలలో చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment