ఇళయరాజాతోపని చేయడం అదృష్టం
విడుదలై – 2 చిత్ర ఆడియో విడుదల వేదికపై దర్శకుడు వెట్రిమారన్, ఇళయరాజా, విజయ్‌సేతుపతి, నటి భవానీశ్రీ
తమిళసినిమా: విడుదలై – 2 చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించడం తన అదృష్టం అని దర్శకుడు వెట్రిమారన్ పేర్కొన్నారు. ఈయన ఇంతకు ముందు తెరకెక్కించిన చిత్రం విడుదలై. నటుడు సూరి కథానాయకుడిగా పరిచయం అయిన ఈ చిత్రంలో విజయ్‌సేతుపతి ప్రధాన పాత్రను పోషించారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఆర్‌ఎస్.ఇన్ఫోటెయిన్‌మెంట్ పతాకంపై ఎల్‌రెడ్.కుమార్ నిర్మించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో దీనికి సీక్వెల్‌గా విడుదలై– 2 చిత్రాన్ని ఇదే టీమ్ రూపొందించింది. ఈ చిత్రం డిశంబర్ 20వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం చైన్నె, సెట్‌పెట్‌లోని లేడీ ఆండాళ్ స్కూల్‌లో నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నటుడు సూరి మాట్లాడుతూ గత 49 ఏళ్లుగా అందరి ఇళ్ల విశేషాల్లోనూ ఇళయరాజా అయ్యానే వేడుక నాయకుడు అని అన్నారు. ఆయన సంగీత దైవం, సంగీత వైద్యుడు ఇలా అన్నింటికీ అర్హుడు ఆయనేనని పేర్కొన్నారు. ఆయన సంగీతం అందించిన చిత్రంలో నటించడం తన భాగ్యం అని అన్నారు. విజయ్‌సేతుపతి మాట్లాడుతూ సూరి వంటి పెద్ద హీరో ఆయన చిత్రంలో నటించే అవకాశం తనకు కల్పించారని పేర్కొన్నారు. భావోద్రేకాలను సంగీతంగా మార్చేవారు ఇళయరాజా అని అన్నారు. ఆయన సంగీతంతో తనకు చాలా ఆనందాన్ని కలిగించిన ఆయనకు ధన్యవాదాలు అన్నారు. విడుదలై – 2 చిత్రాన్ని దర్శకుడు వెట్రిమారన్ మాత్రమే హక్కును పొందడానికి అర్హుడని అన్నారు. నేను బీకామ్‌ను మూడేళ్లు చదివానని, ఈ చిత్రం కోసం వెట్రిమారన్ స్కూల్‌లో నాలుగు ఏళ్లు చదివిన విద్యార్థినని పేర్కొన్నారు. విడుదలై 2 చిత్రం పూర్తి కావడం బాధగా ఉందని, అయినా ఈ ప్రయాణానికి కృతజ్ఞతలు అని నిర్మాత ఎల్‌రెడ్ కుమార్ పేర్కొన్నారు. దర్శకుడు వెట్రిమారన్ మాట్లాడుతూ ఒక చిత్ర నిర్మాణానికి చాలా శ్రమ అవసరం అన్నారు. ఒకరు నమ్మిన విషయాన్ని ఇతరులు గుడ్డిగా నమ్మడం అన్నదే చిత్ర విజయానికి ముఖ్యం అన్నారు. చిత్రాన్ని 2020 డిసెంబర్ నెలలో ప్రారంభించామని, ఇంచుమించు నాలుగేళ్లు అయ్యిందని, ఇంత కాలం ఈ చిత్ర కథను గుర్తించుకుని పరిపూర్ణ నమ్మకంతో పని చేసిన యూనిట్ సభ్యులకు ధన్యవాదాలు అన్నారు. ఈ చిత్రంలోకి ఇళయరాజా రావడం తన అదృష్టం అన్నారు. ఈ చిత్రంలోని నాలుగు పాటలను ఆయనే రాశారని చెప్పారు. విడుదలై 2 చిత్రానికి కథే మాస్టార్ అని దర్శకుడు వెట్రిమారన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment