సాక్షి, హైదరాబాద్/ఇబ్రహీంపట్నం: ఎలాంటి అనుమతులు లేని గురునానక్ యూనివర్సిటీలో చేరిన విద్యార్థులు ఆర్థికంగానే కాకుండా, విద్యా సంవత్సరం నష్టపోయామని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇందుకు కారణమైన వర్సిటీపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. కొత్తగా రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2022లో ఓ చట్ట సవరణ తెచ్చింది.
గత ఏడాది సెపె్టంబర్ 13న ఈ బిల్లుకు అసెంబ్లీ కూడా ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఈ బిల్లును గవర్నర్ ఆమోదానికి పంపారు. ఇప్పటివరకూ దీనిపై గవర్నర్ దగ్గర్నుంచి స్పష్టత రాలేదు. అయితే, గురునానక్‌తోపాటు మరో కాలేజీ కూడా బిల్లుపై స్పష్టత రాకుండానే విద్యార్థులను చేర్చుకుంది. వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. గురునానక్ కాలేజీలో 3వేల మంది విద్యార్థులు చేరారు. 2022–23 విద్యా సంవత్సరం ముగిసినప్పటికీ అనుమతులు రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు.
దీనిపై ప్రభుత్వం సంబంధిత కాలేజీలకు నోటీసులివ్వగా, విద్యార్థుల వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తామని యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే ఈ చర్యతో తమకు జరిగిన నష్టం భర్తీ కాదని విద్యార్థులు అంటున్నారు. తమకు అన్యాయం చేశారంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గురువారం కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఆందోళన కారులు కళాశాలలోకి చొరబడి రాళ్లు, కర్రలతో విధ్వంసం సృష్టించారు. దీంతో పోలీసులు లాఠీలు ఝళిపించి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment