సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లా కలెక్టరేట్ నూతన భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. మొదట కలెక్టరేట్ శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో కేసీఆర్ పాల్గొన్నారు. తరువాత చాంబర్‌లో కలెక్టర్ సీటులో వరుణ్ రెడ్డిని కూర్చోబెట్టి.. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
అంతకు ముందు కలెక్టరేట్ వద్ద పోలీస్ సిబ్బంది ముఖ్యమంత్రికి గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, బాల్క సుమన్, జీవన్‌రెడ్డి, రేఖా నాయక్, నడిపెల్లి దివాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. కాగా నిర్మల్ రూరల్ మండలంలోని ఎల్లపెల్లి గ్రామ శివారులో రూ.56 కోట్లతో ప్రభుత్వం కలెక్టరేట్‌ను నిర్మించింది. నిర్మల్ కలెక్టరేట్ అన్ని హంగులతో నిర్మించగా.. ఇటీవల అందుబాటులోకి వచ్చింది. 16 ఎకరాల్లో 1.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు పైన రెండు అంతస్తులు ఉండేలా కలెక్టరేట్‌ను నిర్మించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఎన్నో అద్భుతాలు సాధించించామని పేర్కొన్నారు. అందరి సమిష్టి కృషితోనే తెలంగాణ సాధించుకున్నామని, అందులో అనుమానం అక్కర్లేదని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాలుగు జిల్లాలుగా విభజింపబడి పరిపాలన ప్రజలకు చేరువైందని. నాలుగు జిల్లాలకు మెడికల్ కాలేజీలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఆసిఫాబాద్ లాంటి అడవి ప్రాంతంలో కూడా మెడికల్ కాలేజీ వచ్చిందన్నారు.
ముఖ్రా కే గ్రామం జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు తీసుకొని మనకు గౌరవం తెచ్చిపెట్టిందని కేసీఆర్ గుర్తు చేశారు. జిల్లా విభజనతో అభివృద్ధి మరింత మెరుగైందని, తాగు, సాగు నీటి సమస్యను అధిగమించామని చెప్పారు. అన్ని వర్గాల్లోపేదలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని, అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ముందుందని కేసీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment