సాక్షి, వరంగల్: స్టేషన్ ఘనపూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య- జానకీపురం సర్పంచ్ నవ్య మధ్య నెలకొన్న వేధింపుల ఎపిసోడ్ కొత్తమలుపు తిరిగింది. సర్పంచ్ నవ్య ఆరోపణలను జాతీయ, రాష్ట్ర మహిళా కమీషన్ లు సుమోటోగా స్వీకరించి.. విచారణ నివేదిక అందించాలని పోలీసులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు తాజాగా నవ్యకు రెండు నోటీసులు జారీ చేశారు.
ఈనెల 21న రాతపూర్వకంగా పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించిన సాక్ష్యాధారాలను రెండు రోజుల్లో సమర్పించాలని సర్పంచ్ నవ్యను నోటీసుల్లో కోరారు ధర్మసాగర్ ఇన్‌స్పెక్టర్. అలాగే.. కాజీపేట ఏసీపీ కార్యాలయం నుంచి కూడా మరో నోటీసు నవ్యకు వెళ్లింది. మూడు రోజుల్లోగా సాక్ష్యాలతో తమను సంప్రదించాలని, విచారణకు సహకరించాలని ఏసీపీ కార్యాలయం కోరింది.
ఎమ్మెల్యేతో పాటు సర్పంచ్ నవ్య తన భర్త, ఎంపీపీ నిమ్మ కవిత, ఎమ్మెల్యే పీఏ శ్రీనివాస్‌పై పీస్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే వేధింపులకు సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని నవ్య ఫిర్యాదు టైంలోనే స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే నవ్య చేసిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని సమాచారం. కాకపోతే విచారణ చేపట్టి.. తదుపరి చర్యలుచేపట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అయితే.. నవ్య మాత్రం ఆ ఫిర్యాదుపై ఫోన్ లిఫ్ట్ చేయకుండా సైలెంట్‌గా ఉండిపోయారని తెలుస్తోంది.
వేధింపులపై మూడు నెలల క్రితం క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే రాజయ్య గ్రామ అభివృద్ధికి 25 లక్షలు ఇస్తానని చెప్పి నయాపైస ఇవ్వకపోగా తనకు ఇచ్చినట్లు ప్రచారం చేస్తూ బాండ్ పేపర్ పై అప్పుగా 20 లక్షలు తీసుకున్నట్టు సంతకం పెట్టమని ఎమ్మెల్యేతో పాటు తన భర్త, ఎంపీపీ, ఎమ్మెల్యే పీఏ వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. భర్తపై ఆరోపణలు చేసిన నవ్య భర్తతో కలిసే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నలుగురిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment