కోఠి ఉమెన్స్ కళాశాల చౌరస్తా వద్ద ధర్నా చేస్తున్న ఆశ వర్కర్లు
సుల్తాన్‌బజార్(హైదరాబాద్): వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంలు సోమవారం ఇక్కడి కోఠి ఉమెన్స్ కళాశాల చౌరస్తాలో బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఒక్కసారిగా వేలసంఖ్యలో ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంలు తరలిరావడంతో ఉమెన్స్ కళాశాల చౌరస్తా జనసంద్రాన్ని తలపించింది. ఎక్కడికక్కడే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
దీంతో చాదర్‌ఘాట్ నుంచి కోఠి బ్యాంక్‌స్ట్రీట్ వరకు ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఒక్కసారిగా వేలాదిమంది చౌరస్తాలో బైఠాయించడంతో పోలీసులు సైతం చేతులెత్తేశారు. ఆశాలు, ఏఎన్‌ఎంలతోపాటు వైద్యశాఖలో పనిచేస్తున్న వివి ధ కేడర్ల కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఆందోళన కొనసాగించారు. దీంతో ఈ ప్రాంతంలో పోలీసులు భారీ బలగాలను మోహరించారు.
Comments
Please login to add a commentAdd a comment