కుప్పకూలిన ఓడేడ్ – గర్మిళ్లపల్లి మధ్య మానేరుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు
కుప్పకూలిన మూడు గడ్డర్లు
అర్ధరాత్రి కూలడంతో తప్పిన పెను ప్రమాదం
మరో ఐదు గడ్డర్లు కూలిపోయే ప్రమాదం!
గర్మిళ్లపల్లి–ఓడేడ్ మానేరు వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన
గత ప్రభుత్వానిదే తప్పిదం: మంత్రి శ్రీధర్‌బాబు
టేకుమట్ల/మహాముత్తారం/ముత్తారం(మంథని): జయశంకర్ భూపాలపల్లి–పెద్దపల్లి జిల్లాను అనుసంధానం చేస్తూ ఓడేడ్ – గర్మిళ్లపల్లి మధ్య మానేరుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు కూప్పకులాయి. సోమవారం రాత్రి వీచిన బలమైన గాలుల ధాటికి పియర్లపై అమర్చిన మూడు గడ్డర్లు ఒక్కసారిగా కిందపడ్డాయి. 2016 ఆగస్టు 4న రూ.47.4కోట్ల అంచనా వ్యయంతో 40 మీటర్ల పొడవున 24 పియర్లతో వంతెన నిర్మాణం ప్రారంభించారు. నాటినుంచి ఈ అంతర్ జిల్లా వంతెన నిర్మాణం నత్తనడకన సాగుతోంది.
ఇప్పటివరకు సగం గడ్డర్లు కూడా పూర్తి కాలేదు. కాగా, సోమవారం రాత్రి బలమైన గాలులకు రెండు, మూడు పియర్లపై అమర్చిన మూడు గడ్డర్లు విరిగి నేలమట్టమయ్యాయి. సిమెంట్ దిమ్మెలకు బదులు కర్రలు పెట్టి గడ్డర్లు బిగించడంతో వర్షానికి తడిసి నానిపోయి మానేరులో నిర్మించిన తాత్కాలిక రోడ్డుపై అవి కూలిపోయాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ రోడ్డుపై పగలు వందలాదిమంది ప్రయాణాలు సాగిస్తుంటారనీ, వంతెన గడ్డర్లు పగలు కూలి ఉంటే ఊహించని ప్రాణనష్టం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
మరో ఐదు గడ్డర్లు కూలేందుకు సిద్ధం
నంబర్ 2, 3 పియర్ల మధ్య ఓ వైపు ఉన్న మూడు గడ్డర్లు కూలిపోగా, మరో పక్క రెండు ఒంగడంతో కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే 23, 24 పియర్లపైనున్న మరో మూడు గడ్డర్లు కూడా ఒక వైపునకు ఒంగి కూలే పరిస్థితిలో ఉన్నాయి.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే: ఎస్‌ఈ
ఆర్ అండ్ బీ జగిత్యాల ఎస్‌ఈ చందర్‌సింగ్, ఈఈ రాములు, గోదావరిఖని ఏసీపీ రమేశ్ మంగళవారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎస్‌ఈ చందర్‌సింగ్ మాట్లాడుతూ, బలమైన గాలుల ధాటికి వంతెనలు కూలవని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే ఇది కూలిందన్నారు.
విచారణ చేపడతాం: మంత్రి శ్రీధర్‌బాబు
గత ప్రభుత్వంలో చేపట్టిన బ్రిడ్జిల నిర్మాణాల నాణ్యత ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, మొన్న కాళేశ్వరం నేడు ఓడేడ్ వంతెన కూలిపోవడమే నిదర్శనమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మహాముత్తారం ప్రచారానికి వచ్చిన ఆయన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి మీడియాతో మాట్లాడారు. కలకాలం ఉండాల్సిన బ్రిడ్జి కడుతుండగానే గాలికి కూలిపోవడం దారుణమన్నారు. ఇలాంటి నిర్మాణాలు నిర్మించిన ఘనత గత ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టి, సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకునే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment