అనారోగ్యంతో రెండు నెలలుగా ఆస్పత్రిలోనే
వెంటిలేటర్‌పై భువనగిరికి తరలింపు
ఫాంహౌస్‌లో తుదిశ్వాస విడిచిన బాలకృష్ణారెడ్డి
సాక్షి, యాదాద్రి: తెలంగాణ మలిదశ ఉద్యమనేత, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు భువనగిరికి చెందిన జిట్టా బాలకృష్ణారెడ్డి (53) కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన సుమారు రెండు నెలలుగా సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శరీరంలోని అన్ని అవయవాలు పాడైపోవడంతో శుక్రవారం ఉదయం జిట్టా ఆరోగ్యం పూర్తిగా విషమించింది. డాక్టర్ల సూచనల మేరకు కుటుంబ సభ్యులు వెంటిలేటర్ మీద ఆయన్ను స్వగ్రామమైన భువనగిరి సమీపంలోని ఫాంహౌస్‌కు తరలించారు. ఫాంహౌస్‌కు చేరుకున్న అనంతరం ఆయన తుదిశ్వాస విడిచారు. బాలకృష్ణారెడ్డిని ఆస్పత్రి నుంచి తరలించే సమయంలో ఆయన కుటుంబ సభ్యులతోపాటు తెలంగాణ ఉద్యమనేత డాక్టర్ చెరుకు సుధాకర్ తదితరులు ఉన్నారు.
అమరవీరుల స్తూపం వద్ద నివాళులు
తన ఫాంహౌస్‌లోనే తుదిశ్వాస విడవాలన్న జిట్టా కోరిక మేరకు వెంటిలేటర్‌పై ఉన్న ఆయన్ను బొమ్మాయిపల్లికి త రలించారు. మార్గమధ్యలో భువనగిరి పట్టణంలో ఆయన నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్తూపం వద్దకు భారీ ర్యాలీతో తీసుకొచ్చి అభిమానులు నివాళులర్పించారు. ఫాంహౌస్‌కు చేరుకున్న తర్వాత జిట్టాకు వెంటిలేటర్ తొలగించడంతో తుదిశ్వాస విడిచారు.
అధికార లాంఛనాల కోసం ప్రయత్నం
ప్రభుత్వ అధికార లాంఛనాలతో జిట్టా అంత్యక్రియలు నిర్వహించాలని అభిమానులు పట్టుబట్టారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డిలు సీఎం కార్యాలయ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. అధికారిక లాంఛనాల కోసం ఇచ్చే ఆరుగురు ఆర్మ్‌డ్‌ఫోర్స్‌లో కనీసం ఇద్దరినైనా ఇవ్వాలని విన్నవించినా అమలు కాలేదు. 4.30 గంటలకు ప్రారంభించాల్సిన జిట్టా అంతిమ యాత్ర గంట ఆలస్యంగా 5.30 గంటలకు ప్రారంభమైంది. టీచర్స్‌కాలనీ మీదుగా బొమ్మాయిపల్లిలోని ఆయన సొంత వ్యవసాయ భూమిలో జిట్టా అంత్యక్రియలు నిర్వహించారు. వేలాదిగా వచ్చిన అభిమానులు తుది వీడ్కోలు పలికారు.
పలువురి నివాళి
కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీతోపాటు అన్ని పార్టీల నేతలు, నాయకులు, కార్యకర్తలు, జిట్టా అభిమానులు, కళాకారు లు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, తదితరులు నివాళులర్పించారు. జిట్టా కుటుంబ సభ్యులను మంత్రి కోమటిరెడ్డి ఓదార్చారు.
⇒ జిట్టా బాలకృష్టారెడ్డి మృతి పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు డా.కె.లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ తదితరులు సంతాపం ప్రకటించారు.
⇒ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో జిట్టా బాలకృష్ణారెడ్డి క్రియాశీలకంగా పాల్గొన్నారంటూ ఆయన కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. ఆయన మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సంతాపం వ్యక్తం చేసిన వారిలో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment