అరికెపూడి గాం«దీకి పీఏసీ చైర్మన్‌పై బీఆర్‌ఎస్ మండిపాటు
హరీశ్, వేముల, గంగుల పేర్లు ప్రతిపాదన
బీఆర్‌ఎస్‌కు సమాచారం లేకుండానే జాబితాలో గాంధీ పేరు
సాక్షి, హైదరాబాద్: పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్యే అరికెపూడి గాం«దీని నియమిస్తూ శాసనసభ కార్యదర్శి సోమవారం విడుదల చేసిన బులెటిన్‌పై రాజకీయ వివాదం రాజుకుంటోంది. రాష్ట్ర శాసనసభ నిర్వహణ నియమావళి ప్రకారం బీఆర్‌ఎస్ నుంచి ముగ్గురు సభ్యులను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ)కి ఎన్నుకోవాల్సి ఉండగా, కేవలం ఇద్దరికి మాత్రమే చోటు దక్కిందని బీఆర్‌ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్ష నేత సూచనలను పరిగణనలోకి తీసుకొని పీఏసీ చైర్మన్‌ను నియమించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. అసెంబ్లీ నియమావళిలోని రూల్ 250 ప్రకారం పీఏసీలో అధికార, విపక్ష సభ్యుల నుంచి తొమ్మిది మందిని ఎన్నుకోవాల్సి ఉంటుంది.
అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యాబలం పీఏసీ ఏర్పాటు చేసే నాటికి 38. ఈ లెక్కన బీఆర్‌ఎస్ తరపున ముగ్గురు ఎమ్మెల్యేలకు పీఏసీలో చోటు కలి్పంచాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆగస్టులో మొదటివారంలో ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్‌ఎస్ శాసనసభాపక్షం ముగ్గురు సభ్యుల పేర్లను పీఏసీకి ప్రతిపాదించింది. ఈ మేరకు మాజీ మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి తమ పత్రాలను సమరి్పంచారు.
అయితే కాంగ్రెస్ నుంచి ఎన్నుకోవాల్సిన ఆరుగురు సభ్యుల పేర్లపై ఏకాభిప్రాయం కుదరాల్సి ఉందని ఆ పార్టీ శాసనసభాపక్షం వ్యవధి కోరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తమను సంప్రదించకుండానే బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాం«దీని తాజాగా పీఏసీ చైర్మన్‌గా నియమించిన తీరును బీఆర్‌ఎస్ తప్పు పడుతోంది. గాం«దీని నియమించడం అసెంబ్లీ నియమావళి, పార్లమెంటరీ స్ఫూర్తికి విరుద్ధమని బీఆర్‌ఎస్ విమర్శిస్తోంది.
ఎవరి ప్రాధాన్యత ఓటుతో ఎంపిక చేశారంటూ.
ప్రాధాన్యత ఓటు ద్వారా ఒక్కో పీఏసీ సభ్యుడిని ఎన్నుకునేందుకు 13 మంది పార్టీ ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరినవారు పది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరి ప్రాధాన్యత ఓటుతో అరికెపూడి గాం«దీని ఎంపిక చేశారని బీఆర్‌ఎస్ ప్రశి్నస్తోంది. 1958–59 నుంచి ప్రతిపక్ష సభ్యుడిని చైర్మన్‌గా ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తోందని తెలంగాణ శాసనసభ హ్యాండ్‌బుక్ పేజీ 65లో ఉంది. పీఏసీ సభ్యుడిగా తాము ప్రతిపాదించిన హరీశ్‌రావు పేరును జాబితా నుంచి తప్పించడం, గాంధీ పేరును చేర్చడం, చైర్మన్ ఎంపికలో ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను సంప్రదించకపోవడం తదితరాలు అసెంబ్లీ నియమావళికి విరుద్ధమని బీఆర్‌ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
అక్కడ ఎంపీల సంఖ్య తక్కువగా ఉన్నా...
పీఏసీ చైర్మన్ నియామకంలో కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం చేయని దుశ్చర్యను తెలంగాణలో కాంగ్రెస్ చేస్తోందని బీఆర్‌ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో కాంగ్రెస్‌కు లోక్‌సభలో అతితక్కువ మంది ఎంపీలు ఉన్నా కేవీ థామస్, మల్లిఖార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌధురి, కేసీవేణుగోపాల్‌ను పీఏసీ చైర్మన్‌గా కేబినెట్ హోదా ఇచ్చిన విషయాన్ని బీఆర్‌ఎస్ ప్రస్తావిస్తోంది. రాజ్యాంగాన్ని కాపాడతామంటూ రాహుల్‌గాంధీ ప్రగల్భాలు పలుకుతుండగా, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నియమాలను తుంగలో తొక్కిందని మండిపడింది.
ప్రజాస్వామ్యం ఖూనీ
పీఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. చేతిలో రాజ్యాంగం పట్టుకొని రాహుల్‌గాంధీ చెప్పే నీతి వాక్యాలు నీటిమూటలు. ఆయనకు రాజ్యాంగం మీద గౌరవం ఉంటే ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వాలని సీఎంను ఆదేశించాలి. అరికెపూడి గాం«దీకి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం రాజ్యాంగాన్ని నిట్టనిలువునా పట్టపగలు ఖూనీ చేయడమే. రాజ్యాంగాన్ని పరిహసిస్తున్న రాహుల్‌కు రాజ్యాంగం గురించి మాట్లాడే నైతికహక్కు లేదు. – హరీశ్‌రావు, మాజీ మంత్రి
ఫిరాయింపు ఎమ్మెల్యేకు పదవి సిగ్గు సిగ్గు
పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజే ఫిరాయింపు ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం సిగ్గుసిగ్గు. ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ హోదాను, పార్టీ మారిన ఎమ్మెల్యేకు కట్టబెట్టడం ఎక్కడి సంస్కృతి. పార్లమెంట్లో పీఏసీ చైర్మన్ పదవిని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్‌కు కట్టబెట్టిన విషయం మరిచారా. దేశ అత్యున్నత చట్టసభలో ఒక న్యాయం, తెలంగాణ చట్టసభలో మాత్రం అన్యాయమా. – కేటీఆర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
Comments
Please login to add a commentAdd a comment