సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ నుంచి ముంబైకి రాకపోకలు సాగించే దేవగిరి ఎక్స్‌ప్రెస్ 17058/17057 ఇక నుంచి సికింద్రాబాద్‌కు బదులు లింగంపల్లి నుంచి దేవగిరికి రాకపోకలు సాగించనుందని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ నుంచి అజంతాకు వెళ్లే అజంతా ఎక్స్‌ప్రెస్(17064/17063) ఇక నుంచి మల్కాజిగిరి స్టేషన్‌లో అదనపు హాల్ట్‌తో కాచిగూడ స్టేషన్ నుంచి అజంతాకు రాకపోకలు సాగించనుంది.
ఈ నెల 20వ తేదీ నుంచి ఈ మార్పులు అమలులోకి రానున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్‌లో రైళ్ల ఒత్తిడిని తగ్గించేందుకు ఈ రెండు రైళ్ల టర్మినళ్లను మార్చినట్లు సీపీఆర్వో తెలిపారు. నగరంలోని పశి్చమ ప్రాంతంలో వేగంగా జరుగుతున్న అభివృద్ధి, ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాల విస్తరణ, ప్రముఖ వ్యాపారసంస్థల ఏర్పాటు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని లింగంపల్లి నుంచి దేవగిరి ఎక్స్‌ప్రెస్ రాకపోకలు సాగించేవిధంగా మార్పు చేసినట్లు పేర్కొన్నారు.
లింగంపల్లి స్టేషన్‌కు పొడిగించడం వల్ల ముంబైకి మాత్రమే కాకుండా నిజామాబాద్, బాసర్, నాందేడ్, మన్మాడ్, నాసిక్ వంటి ముఖ్యమైన పట్టణాలకు వెళ్లే ప్రయాణికులకు సదుపాయంగా ఉంటుంది. అజంతా ఎక్స్‌ప్రెస్‌ను కాచిగూడ స్టేషన్‌కు మార్చడం వల్ల కాచిగూడ నుంచి షిర్డీ(నాగర్‌సోల్ స్టేషన్) మధ్య రోజువారీ ఎక్స్‌ప్రెస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ రైలుకు అదనంగా ఒక 2 టైర్ ఏసీని జతచేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment