Dalita Bandhu Opening Ceremony; CM KCR Funny Speech Video Goes Viral - Sakshi
Sakshi News home page

‘ఇంటికొస్తే చాయ్‌ పొయ్యాలె?’ నవ్వులు పూయిస్తున్న సీఎం కేసీఆర్‌ ప్రసంగం

Published Mon, Aug 16 2021 7:45 PM | Last Updated on Tue, Aug 17 2021 3:48 PM

CM KCR Funny Speech In Dalita Bandhu Opening Ceremony - Sakshi

సాక్షి, కరీంనగర్‌: టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ప్రసంగమంటే తెలుగు ప్రజలు ఆసక్తిగా వింటారు. చమక్కులు, ఛలోక్తులు, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ.. సామెతలతో పాటు తెలంగాణ యాసతో మాట్లాడుతుండడం సీఎం కేసీఆర్‌ ప్రసంగ శైలి. తాజాగా కరీంనగర్‌ జిల్లా శాలపల్లిలో సోమవారం జరిగిన ‘తెలంగాణ దళితబంధు’ పథకం ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ఈ ప్రసంగంలోనూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సరదాగా మాట్లాడడంతో నవ్వులు విరబూశాయి.

లబ్ధిదారుతో సరదా సంభాషణ
దళిత బందు లబ్ధిదారుగా ఎంపికైన హుజురాబాద్‌ మండలం కనుకులగిద్దకు చెందిన కొత్తూరి రాధ, ఆమె భర్త మొగిలికి దళితబంధు చెక్కు, లబ్ధిదారు కార్డు సీఎం కేసీఆర్‌ స్వయంగా అందించారు. ఈ సందర్భంగా మైక్‌ అందుకుని ‘ఏమ్మా ఈ డబ్బులతో ఏం చేస్తావ్‌’ అని అడగ్గా రాధ డెయిరీ పెట్టుకుంటానని చెప్పింది. ‘పాలు అమ్ముతవా? మంచిగా అమ్ముతవా? పక్కా మాట కదా’ సరదాగా ప్రశ్నించారు. ‘మళ్లొచ్చిన్నాడు మీ ఇంటి కాడ ఛాయ్‌ పొయ్యాలే’ అని సీఎం కేసీఆర్‌ అనడంతో సభికులతో పాటు సమావేశానికి హాజరైన వారందరూ ఘొల్లున నవ్వారు. 

‘వెంకన్న నువ్వు ముందటికుండు’
అంతకుముందు ప్రసంగంలో దళిత బంధుపై పాట రాసిన కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న ప్రస్తావన తెచ్చారు. ‘వచ్చిండా వెంకన్న? ఎనకకు ఎందుకు పోయినవ్‌. నువ్వు ముందటికుండు’ అని చెప్పడంతో గోరటి వెంకన్న లేచి నిలబడ్డారు. ముందు వరసలోకి రమ్మని విజ్ఞప్తి చేసినా వెంకన్న రాలేదు. ‘మట్టిల్లోంచే సిరులు తీసే మహిమ నీకూ ఉన్నది.. పెట్టుబడియే నీకు వరిస్తే నీకు ఎదురేమున్నది’ అని గోరటి వెంకన్న రాసిన పాటను కొంత ప్రస్తావించారు. అనంతరం మరో కవి రాసిన .. ‘సుక్కల ముగ్గు ఏసినట్టు సెల్లెల.. నువ్వు సక్కంగా కూడబెట్టు సెల్లెల్ల’ అని పాట పాడారు. 

  • ‘నడిమొళ్లకు ఎందుకు కడుపు ఉబ్బస’ అని దళితబంధుపై ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్‌ ఇచ్చారు. ‘కిరికిరిగాళ్లు.. కొండిగాళ్లు ఒకరు కీ.. ఒకరు కా అంటే’ అంటూ ప్రతిపక్ష నాయకుల విమర్శలపై స్పందించారు.
  • ‘సర్కార్‌ చేయగూసొంగ.. ముఖ్యమంత్రి ఇయ్యగూసున్నాంక ఏదన్నా ఆగుతదా? రాజు తలుచుకున్నాక దెబ్బలకు కొదువుంటదా?’ అని దళిత బంధును ఎవరూ ఆపలేరని కుండబద్దలు కొట్టి చెప్పారు.
  • హుజురాబాద్‌ గురించి మాట్లాడదామా? అని సీఎం కేసీఆర్‌ అడగ్గా సమావేశానికి హాజరైన వారంతా ఓ స్థానిక నాయకుడికి మద్దతుగా నినాదాలు చేశారు. ‘నాయకత్వాలు వెనకసిరికి. ఆగాలే.. ఆగాలే. హే బాబు ఆగాలె’ అని వారించారు. 
  • ఐఏఎస్‌ అధికారి రాహుల్‌ బొజ్జాను ప్రత్యేకంగా ప్రస్తావించారు. సీఎంఓలో కార్యదర్శిగా ఉంటాడని చెప్పారు. ఆయన తండ్రి బొజ్జా తారకం అని గుర్తుచేశారు. ఉద్యమంలో పని చేసిన బిడ్డలకు న్యాయవాదిగా పని చేశాడని, చాలా గొప్ప న్యాయవాది, ప్రజల కోసం పని చేశారని కీర్తించారు.
  • ప్రసంగం ముగిస్తూ ‘ఒక్క మీ పిడికిలి బిగిస్తలేదు.’ అని చెప్పగా ‘నాకు చెవులు మందమైనవా? వినబడతలేదు. టెంట్‌ లేచిపోవాలె’ అని అంటూ ‘జై దళిత బంధు’ ప్రజలతో నినదింపజేశారు. ‘జై భీమ్‌.. జై హింద్‌.. జై తెలంగాణ’ అంటూ ప్రసంగం ముగించారు.
  • సభ నుంచి నిష్క్రమిస్తుండగా మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య కేసీఆర్‌ చేతిని ముద్దాడారు.
  • ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన హుజురాబాద్‌ నాయకుడు పాడి కౌశిక్‌ రెడ్డి ప్రత్యేక జ్ఞాపిక అందించారు. అంబేడ్కర్‌తోపాటు సీఎం కేసీఆర్‌ను చిత్రించిన భారీ పెయింటింగ్‌ను కేసీఆర్‌కు అందించి ఆ పెయింటింగ్‌ వివరాలను కౌశిక్‌ రెడ్డి వివరించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement