సాక్షి, కరీంనగర్ జిల్లా: ప్రతిష్టాత్మక తెలంగాణ దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించారు. శాలపల్లి బహిరంగసభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్.. అనంతరం దళితబంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా 15 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున చెక్కులతో పాటు దళితబంధు ఎలక్ట్రానిక్ కార్డులను సీఎం అందజేశారు.
దీనిలో భాగంగా ముందుగా కేసీఆర్ తన ప్రసంగాన్ని జై భీమ్ అంటూ మొదలు పెట్టారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దళితబంధు పథకంతో దళితులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతుబంధు పథకంతో వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలు వస్తాయన్నారు. రైతుబంధు పథకంతో తెలంగాణ రైతుల్లో ధీమా పెరిగిందని, రైతు బీమా పథకం కూడా విజయవంతంగా కొనసాగుతోందని అన్నారు.
తెలంగాణ సాధనలో తొలి నుంచి కరీంనగర్ జిల్లా ముందుందన్న కేసీఆర్ దళితబంధు ప్రభుత్వ కార్యక్రమం కాదని ఇది మహా ఉద్యమమని వ్యాఖ్యానించారు. ఈ ఉద్యమం కచ్చితంగా విజయం సాధించి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వల్ల దళితబంధు ఆలస్యమైందని, దళితబంధు సరికొత్త చరిత్ర సృష్టిస్తుందన్నారు. తెలంగాణ సాకారమైనట్లే దళితుల అభివృద్ధి కూడా జరగాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment