సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ ఇళ్లు ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సొంత ఇళ్లు ఉంటే పేదలు ఆత్మగౌరవంతో, ఉన్నతంగా బతుకుతారని అన్నారు. కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొచ్చి పేదలకు ఇళ్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
తెలంగాణ సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ.. ఇళ్లకు సంబంధించి విధి విధానాలు సరళీకృతం చేస్తూ యాప్ రూపొందించాం. ఈ యాప్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుంది. ఐటీడీఏ ప్రాంతాల్లో కోటాతో సంబంధం లేకుండా జనాభా ప్రాతిపదికన ఇళ్ల ప్రక్రియ జరుగుతుంది.
ఇందిరమ్మ ఇళ్లపై ఉన్న లోన్స్ తీర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా 7 వేల మందికి రుణ విముక్తి కలుగుతుంది. అర్హుల జాబితాను తయారు చేసి కేంద్రానికి పంపుతాం. మొదటి ఏడాది ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లను పంపిణీ చేయబోతున్నాం. 3500 ఇండ్లతో సంబంధం లేకుండా ఆదివాసులకు ప్రత్యేక కోటా ఉంటుంది. 2004 నుంచి 14 వరకు వైఎస్సార్ హయంలో 25లక్షల 4వేల ఇండ్లను పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ జరిగింది. ప్రతీ మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ కట్టబోతున్నాం ప్రజలు వచ్చి చూడవచ్చు. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కి తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభానికి ఆహ్వానం పంపుతున్నాం. పొన్నం ప్రభాకర్ వెళ్లి వారిని పిలుస్తారు. కేసీఆర్‌కు కూడా ఆహ్వానం పంపిస్తున్నాం. 7, 8, 9 తేదీల్లో ట్యాంక్ బండ్ ప్రాంతంలో పండుగ వాతావరణం ఉంటుంది.
పేదలకు భూములపై హక్కు కల్పించింది ఇందిరమ్మే. ఏ ఊరికి వెళ్లినా ఇందిరమ్మ కాలనీ ఉంటుంది. రుణ విముక్తి చేయడం ద్వారా పేదలకు ఇళ్లపై హక్కు కల్పించాం. కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొచ్చి పేదలకు ఇళ్లు కట్టిస్తాం. కేసీఆర్ రద్దు చేసిన హౌసింగ్ బోర్డును పునరుద్దరిస్తాం. బీఆర్‌ఎస్ ప్రాధాన్యత వారి సొంత భవనాలు, పార్టీ కార్యాలయాలే. బీఆర్‌ఎస్ పాలనలో బస్తీ బస్తీలో బెల్టు షాపులు ఉండేవి. రూ.16వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో తెలంగాణ ఏర్పడితే ఇప్పుడు పరిస్థితేంటి?. బీఆర్‌ఎస్ పాలనలో వేల ఎకరాలు అప్పనంగా అమ్మేశారు. అద్బుతంగా ఉపన్యాసాలు ఇచ్చారు తప్ప ఇళ్లను ఇవ్వలేదు. ప్రతిపక్షాలు మాకు సహకరించాలి.. సూచనలు చేయాలి. కేసీఆర్ మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి.. మాకు సూచనలు ఇవ్వండి. తెలంగాణ రైజింగ్ అని మనం అనకూడదా?. మీ చతురత చూపించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టండి’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment