రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి | CM Revanth Reddy called on diplomats of 13 countries | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి

Published Thu, Jan 11 2024 4:53 AM | Last Updated on Thu, Jan 11 2024 8:00 AM

CM Revanth Reddy called on diplomats of 13 countries - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని 13 దేశాల దౌత్యవేత్తలు, ఇతర ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అందుకు తగిన సూచనలు చేయాలని కోరారు. అన్ని దేశాలతో సత్సంబంధాలకి తమ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుందని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లోని కుతుబ్‌ షాహీ టూంబ్స్‌ వద్ద 13 దేశాల దౌత్యవేత్తలు, ఇతర ప్రతినిధులకు సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఆతిథ్యం ఇచ్చారు. అమెరికా, ఇరాన్, తుర్కియే, యూఏఈ, యూకే, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్‌ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి రేవంత్‌రెడ్డి స్వాగతం పలుకుతూ ప్రభుత్వం ప్రాధాన్యతలను వివరించారు.

అభయహస్తం కింద అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధులు మహాత్మా గాం«దీ, జవహర్‌ లాల్‌ నెహ్రూ, సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ తదితర నేతల ఆశయాలను, మాజీ ప్రధాని ఇందిరాగాం«దీని స్ఫూర్తిగా తీసుకుని సమానత్వం, పారదర్శకతతో కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు వివరించారు. 

సంక్షేమ రాష్ట్రంగా ఆవిర్భావం 
తాము ప్రకటించి అమలు చేస్తోన్న ఆరు హామీలతో సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిస్తుందని సీఎం రేవంత్‌ తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తోందని సీఎం చెప్పారు. యువత భవిష్యత్తుకు, పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్, హైదరాబాద్‌ రీజనల్‌ పాస్‌ పోర్ట్‌ ఆఫీసర్‌ స్నేహజ, ఇతర అధికారులు పాల్గొన్నారు  

సీఎంతో అమెజాన్‌ బృందం భేటీ 
సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ ఈ–కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ప్రతినిధుల బృందం బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సమావేశమైంది. రాష్ట్రంలో అమెజాన్‌ సంస్థ పెట్టిన పెట్టుబడులు, భవిష్యత్తు వ్యాపార విస్తరణ ప్రణాళికల వంటి అంశాలను ఈ సమావేశంలో సంస్థ ప్రతినిధులు సీఎంకు వివరించారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement