సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఏయే కేటగిరీ బస్సుల్లో అమలు చేస్తే ఎంత భారం పడనుందనే విషయంలో ఆర్టీసీ అధికారులు లెక్కలు సిద్ధం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఈ పథకం ఎలా అమలవుతోంది, అక్కడ ఎంత ఖర్చవుతోంది, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా సర్దుబాటు చేస్తోంది..అన్న విషయాలను పరిశీలించేందుకు నలుగురు ఆర్టీసీ అధికారుల బృందం బెంగళూరుకు వెళ్తోంది.
రెండు రోజుల పాటు అక్కడ పరిశీలించి నివేదికను సిద్ధం చేయనుంది. అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజా ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలోకి రావటంతో అధికారులు పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేస్తున్నారు.
ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం కొలువుదీరబోతోంది. దీంతో వీలైనంత తొందరలో ఈ పథకం అమలు చేసే అవకాశం ఉన్నందున, ముఖ్యమంత్రి అడిగిన వెంటనే నివేదిక అందజేసేందుకు వీలుగా ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది.
ఎక్స్‌ప్రెస్ సర్విసుల్లో కూడా అమలు చేస్తే..
దక్షిణాదిలో తొలుత తమిళనాడు రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పించారు. కానీ అక్కడ, కేవలం నగర, పట్టణ ప్రాంతాల్లో తిరిగే సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఈ వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం ప్రత్యేకంగా గులాబీ రంగులో ఉండే బస్సులను అందుబాటులోకి తెచ్చారు. వాటిల్లోనే ఈ వెసులుబాటు ఉంటుంది.
కానీ, కర్ణాటకలో మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ఈ వసతి కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీని ప్రకటించింది. అధికారంలోకి రావటంతో దాన్ని అమలులోకి తెచ్చింది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది.
కానీ కర్ణాటక మోడల్‌ను అనుసరిస్తుందా, తమిళనాడు మోడల్‌ను చేపడుతుందా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. కర్ణాటక తరహాలో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తే సాలీనా రూ.2200 కోట్లు అవుతుంది. పల్లెవెలుగు బస్సులకే పరిమితం చేస్తే ఏటా రూ.750 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు.
ప్రభుత్వం ఇవ్వాల్సింది ప్రతినెలా దాదాపు రూ.185 కోట్లు ..
మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభమైతే, ఆ రూపంలో ఆర్టీసీ కోల్పోయే టికెట్ ఆదాయాన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్‌ప్రెస్ కేటగిరీ బస్సుల వరకు ఈ పథకాన్ని అమలు చేస్తే సాలీనా రూ.2200 కోట్ల వరకు రీయింబర్స్ చేయాలి. అంటే ప్రతి నెలా రూ.185 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.
జీరో టికెట్ ప్రవేశపెడతారా..?
ఎంతమంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారన్నది లెక్క తేలాల్సి ఉంటుంది. ఇందుకోసం కర్ణాటకలో జీరో టికెట్ విధానం ప్రారంభించారు. మహిళలకు రూ.సున్నా అని ఉండే జీరో టికెట్‌ను జారీ చేస్తారు. అలా రోజుకు ఎన్ని టికెట్లు జారీ అయ్యాయో నమోదు చేసి నెలవారీగా లెక్కిస్తారు. ఇక్కడ అదే పద్ధతి ప్రవేశపెడతారా లేక మరో విధానాన్ని అనుసరిస్తారా అన్నది తేలాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment