![CPM Leader Tammineni Veerabadram Health bulletin released - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/17/tamineni.jpg.webp?itok=STWTxlO5)
సాక్షి, హైదరాబాద్: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం విషమంగా ఉందని ఏఐజీ ఆస్పత్రి ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. స్వగ్రామమైన ఖమ్మం జిల్లాలోని తెల్దారుపల్లిలో ఉన్న తమ్మినేనికి సోమవారం సాయంత్రం ఒంట్లో నలతగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు పల్స్ తక్కువగా ఉండటాన్ని గుర్తించి వెంటనే చికిత్స అందించారు. అయితే గుండె కొట్టుకోవడంలో తేడాలున్నాయని వైద్యులు చెప్పారు. దీంతో కుటుంబసభ్యులు తమ్మినేనిని వెంటిలేటర్ సపోర్టుతో ఖమ్మం నుంచి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.
గుండె పనిచేయకపోవడం, గుండె కొట్టుకోకపోవడంతో అసాధారణ పరిస్థితి నెలకొందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దీంతోపాటు మూత్రపిండాలు పనిచేయకపోవడం, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల ఇన్వాసివ్ వెంటిలేషన్ అవసరమైంది. బీపీ మెరుగుపరిచేందుకు మందులు అందిస్తున్నారు. ఊపిరితిత్తుల నుంచి నీరు తొలగించి, గుండె సాధారణ స్థితికి వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. డాక్టర్ సోమరాజు, డాక్టర్ డీఎన్ కుమార్ మార్గదర్శకత్వంలో తమ్మినేనికి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి ఇంకా విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై ఉన్నారని ఆ బులెటిన్‌లో ఏఐజీ వెల్లడించింది.
ఆస్పత్రిలో తమ్మినేని ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో సంప్రదించి తగిన వైద్యం అందించడానికి పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, డీజీ నరసింహారావు, పి.ప్రభాకర్ పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు తమ్మినేనిని మాజీ మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. తమ్మినేని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. 2004లోనూ తమ్మినేనికి గుండెనొప్పి రావడంతో వైద్యులు స్టంట్స్ వేశారు.
Comments
Please login to add a commentAdd a comment