సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిష్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య ఘర్షణ ఎపిసోడ్ రాజకీయంగా చర్చకు దారి తీసింది. వాదనలు, ఘర్షణల సందర్భంగా ఇరు వర్గాల నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇక, అరెస్ట్‌లపై తాజాగా సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి కీలక వ్యాఖ్యలు చేశారు.
తాజాగా సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి కేసులో అరికెపూడి గాంధీని అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. ముందస్తు చర్యల్లో భాగంగానే హరీష్‌రావు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నాం. హరీష్‌రావుకు అరెస్ట్ చేసిన నోటీసు ఇచ్చి పంపించివేశాం. పోలీసుల విధులకు కౌశిక్‌రెడ్డి ఆటంకం కలిగించారని మరో కేసు నమోదైంది. కౌశిక్, గాంధీలపై మూడు కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.
ఇదిలా ఉండగా.. హుజురాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మహిళా కాంగ్రెస్ నేతలు శుక్రవారం (సెప్టెంబర్13) స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో కౌశిక్‌రెడ్డి ఓటర్లను బెదిరించి గెలిచారని, గెలిచాక మహిళలను కించపరుస్తూ మాట్లాడినందున కౌశిక్‌రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.
అయితే, పార్టీ ఫిరాయింపుల విషయంలో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా కౌశిక్‌రెడ్డి మీడియా సమావేశంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ వారికి చీర,గాజులను పంపిస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: కౌశిక్ వ్యాఖ్యలపై కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి: మంత్రి కోమటి రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment