జేబులు నింపుకొనేందుకే ప్రాజెక్టులు కట్టారు | Decision on Kaleshwaram Lift Irrigation Scheme after NDSA Uttam meeting | Sakshi
Sakshi News home page

జేబులు నింపుకొనేందుకే ప్రాజెక్టులు కట్టారు

Published Sat, Jul 20 2024 5:04 AM | Last Updated on Sat, Jul 20 2024 5:04 AM

Decision on Kaleshwaram Lift Irrigation Scheme after NDSA Uttam meeting

మంత్రులు ఉత్తమ్, పొంగులేటి ఆరోపణ 

రూ.94 వేల కోట్లు ఖర్చు చేసి కనీసం లక్ష ఎకరాలకు కూడా నీరివ్వలేదు 

కాళేశ్వరం ప్రాజెక్టుపై నేడు ఎన్‌డీఎస్‌ఏతో భేటీ: ఉత్తమ్‌ 

గొప్పలకు పోకుండా వాస్తవాలు ప్రతిబింబించేలా బడ్జెట్‌: పొంగులేటి

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: గత ప్రభుత్వ పెద్దలు కేవలం జేబులు నింపుకొనేందుకే ప్రాజెక్టులు కట్టారని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వ పెద్దలు ప్రాజెక్టులకు రూ.94 వేల కోట్లు ఖర్చు చేసి కనీసం లక్ష ఎకరాలకు కూడా నీరివ్వలేదని, స్థిరీకరణ కూడా సరిగా లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక బ్లండర్‌ అని, దీనిపై నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) సూచనల ఆధారంగా ముందుకు వెళ్తామని చెప్పారు. రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ కోసం ఉమ్మడి జిల్లా పర్యటనకు వచి్చన మంత్రులు..స్థానిక ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 

కాళేశ్వరం స్ట్రక్చరల్‌ బ్లండర్‌: ఉత్తమ్‌ 
‘కాళేశ్వరంతో ఐదేళ్ల కాలంలో మొత్తం ఎత్తిపోసింది కేవలం 65 టీఎంసీలే. పైగా ఏటా రూ.10 వేల కోట్ల కరెంటు బిల్లులు వస్తున్నాయి. అదే తమ్మిడిహెట్టి వద్ద కట్టి ఉంటే రూ.34 వేల కోట్లలో ప్రాజెక్టు పూర్తయ్యి ఏటా రూ.వెయ్యి కోట్ల బిల్లు మాత్రమే వచ్చేది. పాలమూరు–రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టుల్లోనూ అవినీతే. ఇటీవల జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ ముందు హాజరైన కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు కాళేశ్వరంపై అఫిడవిట్‌ సమర్పించారు.

ప్రాజెక్టు డిజైన్, నిర్మాణంలో లోపాలున్నాయని ఎన్‌డీఎస్‌ఏ తన మధ్యంతర నివేదికలో తెలిపింది. కాళేశ్వర్యం స్ట్రక్చరల్‌ బ్లండర్‌. ఇదే విషయంపై శనివారం ఢిల్లీలో ఎన్‌డీఎస్‌ఏ అధికారులతో నేను, నీటిపారుదల ముఖ్య కార్యదర్శి భేటీ అవుతాం. వారిచ్చే సలహాల ఆధారంగానే కాళేశ్వరంపై ముందుకెళ్తాం..’అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఈ నెలాఖరుకు ఆదిలాబాద్‌లో సదర్మాట్‌ ప్రాజెక్టు ప్రారంభిస్తామని, గౌరవెల్లి ప్రాజెక్టును ప్రాధాన్యత క్రమంలో చేపడతామని తెలిపారు.  

ఆరోగ్యశ్రీ, రేషన్‌కు ప్రత్యేక కార్డులు 
‘ఆరోగ్యశ్రీ, రేషన్‌కు ప్రత్యేక కార్డులిస్తాం, దరఖాస్తులు కూడా వేర్వేరుగా ఉంటాయి. కేంద్రం బడ్జెట్‌లో తెలంగాణకు సముచిత స్థానం ఇస్తుందని ఆశిస్తున్నాం. బీఆర్‌ఎస్‌ త్వరలో నామమాత్రంగా ఉండిపోతుంది. మరింతమంది ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరతారు..’అని ఉత్తమ్‌ చెప్పారు. 

అప్పుల భారం ఉన్నా రుణమాఫీ: పొంగులేటి 
గత ప్రభుత్వం మాదిరి గొప్పలకు పోయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టమని, వాస్తవాలను ప్రతిబింబించేలా మాత్రమే ఉంటుందని మంత్రి పొంగులేటి అన్నారు. ‘గత ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పుల భారం మాపై మోపింది. అయినా మేం రైతు రుణమాఫీ కింద రూ.31 వేల కోట్ల రుణాలు రద్దు చేస్తున్నాం. మాది రైతు పక్షపాత, పేదల ప్రభుత్వం. గత ప్రభుత్వం రైతుబంధు పేరిట గుట్టలకు కొండలకు ని«ధులిచ్చి ఆర్థిక విధ్వంసానికి పాల్పడింది. అందుకే, మేం రైతు భరోసా విషయంలో అభిప్రాయాలు అడిగేందుకు వచ్చాం..’అని చెప్పారు.  

మధ్యంతర నివేదికను అమలు చేశారా! 
⇒ సమగ్ర నివేదికతో  సమావేశానికి హాజరుకండి 
⇒కాళేశ్వరం బరాజ్‌లపై భేటీకి రావాలని ఎన్డీఎస్‌ఏ పిలుపు 
⇒నేటి సమావేశానికి మంత్రి ఎన్‌.ఉత్తమ్, అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల్లోని లోపాలను గుర్తించేందుకు జియో ఫిజికల్, జియో టెక్నికల్‌ పరీక్షలు నిర్వహించాలంటూ మధ్యంతర నివేదికలో తాము చేసిన సిఫారసులను అమలు చేశా రా? అని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అదేవిధంగా బరాజ్‌లకు వర్షాకాలంలో మరింత నష్టం జరగకుండా మధ్యంతర నివేదికలో సూచించిన అత్యవసర చర్యలు తీసుకున్నారా? అని నిలదీసింది.

నివేదిక అమలుకు తీసుకున్న చర్యలతో శనివారం డిల్లీలో జరిగే సమావేశానికి రావాలని రాష్ట్ర నీటిపారుదల శాఖను కోరింది. ఈ సమావేశానికి నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హాజరుకానున్నారు. కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యానికి గల కారణాలపై వానాకాలానికి ముందు జియో ఫిజికల్, జియో టెక్నికల్, స్ట్రక్చరల్‌ స్టెబిలిటీ పరీక్షలు చేసి నివేదిక ఇవ్వాలని అప్పట్లో ఎన్డీఎస్‌ఏ కోరింది.

ఈ పరీక్షలన్నీ కేంద్ర నీటి, విద్యుత్‌ పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌), సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్‌ రిసేర్స్‌ స్టేషన్‌(సీఎస్‌ఎంఆర్‌ఎస్‌), జాతీయ భూ¿ౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌ జీఆర్‌)తో చేయించాలని గత మే 1న మధ్యంతర నివేదికను ఇచి్చన విషయం విదితమే. నివేదిక అమలులో పురోగతిని తెలపాలని కోరుతూ గత మే 18న, జూన్‌ 25న, మళ్లీ ఈనెల 11న తెలంగాణకు ఎనీ్టఎస్‌ఏ వరుస లేఖలు రాసింది. 

నేటి భేటీలో వాటిపైనే చర్చ 
అన్నారం, సుందిళ్లలో పరీక్షల కోసం బోర్‌ హోల్స్‌ వేస్తుండగా... ఇసుక, నీరు ఇయటికి వస్తున్నాయని, ఈ కారణంగా పరీక్షలు నిలుపుదల చేసి, జియో టెక్నికల్‌ పరీక్షల కోసం ప్రత్యామ్నాయాలు సూచించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 5వ తేదీన లేఖ రాసింది. అయితే అన్నారం,  సుందిళ్ల బరాజ్‌ల్లో ఇప్పటిదాకా ఎన్ని బోరోల్స్‌/ డ్రిల్లింగ్స్‌ చేశారు? బ్యారేజీల ఎగువ, దిగువ భాగంలో ఇప్పటిదాకా ఎన్ని డ్రిల్లింగ్‌ చేశారు..? వంటి అంశాలపై సమగ్ర వివరాలు అందించాలని ఎన్డీఎన్‌ఏ కోరింది.

కేంద్ర నీటి, విద్యుత్‌ పరిశోధన సంస్థ(సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌) ఇచి్చన నివేదిక ఏమిటి. బ్యారేజీల పై అధ్యయనాలు, పరిశోధనలపై ఫొటోలతో సహా సమగ్ర నివేదికను అందించాలని ఎనీ్టఎస్‌ఏ నిర్దేశించింది. ఈ అంశాల ఆధారంగా శనివారం జరిగే సమావేశంలో చర్చించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement