సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి నిర్వాహకులకు చిత్రమైన సమస్య వచ్చిపడింది. కొన్నేళ్ల క్రితం మెడికల్ కాలేజీతో సంయుక్తంగా వీరు తయారు చేయించిన వెబ్‌సైట్ ప్రస్తుతం ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్లిపోయింది. దీంతో కనీసం అప్‌డేట్ చేయడానికి సాధ్యం కావట్లేదని, ఆ వెబ్‌సైట్‌ను తమకు ఇప్పించాలంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన అధికారులు తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై సమాలోచన చేస్తున్నారు. ఏసీపీ కేవీఎం ప్రసాద్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
► గాంధీ ఆసుపత్రి, మెడికల్ కాలేజీలకు కలిపి కొన్నేళ్ల క్రితం గాంధీహాస్పిటల్.ఇన్ పేరుతో వెబ్‌సైట్ రూపొందించారు. ప్రైవేట్ సంస్థ యూసీ ద్వారా దీనిని తయారు చేయించడంతో పాటు వాళ్లే నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు.
► యూసీ సంస్థ ఈ వెబ్‌సైట్‌ను మరో సంస్థకు చెందిన సర్వర్‌లో హోస్ట్ చేసింది. దీని నిమిత్తం నిర్ణీత సమయానికి సర్వర్ నుంచి స్పేస్ ఖరీదు చేయడంతో పాటు రెన్యువల్ చేయాల్సి ఉంటుంది.
► అలా కాని పక్షంలో సదరు వెబ్‌సైట్ ఓపెన్ స్పేస్‌లోకి వచ్చేయడంతో పాటు మరొకరు ఖరీదు చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కొన్నాళ్లుగా గాంధీ ఆసుపత్రి వర్గాలు రెన్యువల్ చేయించలేదు.
► దీనికితోడు యూసీ సంస్థ కూడా నిర్వహణ బాధ్యతల నుంచి వైదొలగింది. సర్వర్‌ను అందించిన సంస్థ ఈ సైట్‌ను సేల్‌లో పెట్టడంతో డైనాడాట్.కామ్ వారు కొనుగోలు చేయడంతో వెబ్‌సైట్ పూర్తిగా వారి చేతుల్లోకి వెళ్లిపోయింది.
► ఇటీవల ఆ వెబ్‌సైట్‌ను అప్‌డేట్ చేయడానికి గాంధీ ఆసుపత్రి నిర్వాహకులు ప్రయత్నించినా సా ధ్యం కాలేదు. యాక్సస్ కూడా లేక పోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. ఆరా తీయగా వెబ్‌సైట్ డైనాడాట్.కామ్ చేతిలో ఉన్నట్లు గుర్తించారు.
► ఆసుపత్రి నిర్వాహకులు సదరు సంస్థతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు గత వారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. అధీకృతం కాని వారి చేతిలో వెబ్‌సైట్ ఉందని ఆరోపించారు.
► ఈ ఫిర్యాదు ఆధారంగా ఐపీసీలోని 419, ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 66–డీ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా డైనాడాట్.కామ్‌ను సంప్రదించి కంటెంట్‌తో ఉన్న వెబ్‌సైట్ ఎలా ఆధీనంలో ఉంచుకుంటారని ప్రశ్నించారు. (చదవండి: ఆన్‌లైన్‌లో అమెరికాకే ‘మత్తు’)
► ఆ వెంటనే స్పందించిన ఆ సంస్థ వెబ్‌సైట్‌లో ఉన్న కంటెంట్ మొత్తం తొలగించింది. ఈ విషయంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై సైబర్ క్రైమ్ పోలీసులు సమాలోచన చేస్తున్నారు. చట్ట ప్రకారం ఆ సంస్థపై చర్యలకు ఆస్కారం లేదని తెలుస్తోంది.
► సాధారణంగా ప్రభుత్వ వెబ్‌సైట్లన్నీ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) ఆధీనంలో జీఓవీ.ఇన్‌తో రూపొందుతాయి. ఇలాంటి వెబ్‌సైట్లు పూర్తి భద్రమైనవే కాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లవు. గాంధీ ఆసుపత్రి నిర్వాహకులు అలా చేయకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు పేర్కొంటున్నారు. (క్లిక్: 300 మందికి పైగా ఔట్‌సోర్సింగ్ జేపీఎస్‌లకు ఉద్వాసన)
Comments
Please login to add a commentAdd a comment