సాక్షి,హైదరాబాద్ : బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16 న పంజాగుట్ట పోలీసుల ఎదుట సాహిల్ హాజరు కావాలని సూచించింది.
గతంలో, ప్రజా భవన్ గేట్లను తన కారుతో ఢీకొట్టాడంటూ సాహిల్‌పై పంజాగుట్ట పోలీసులకు కేసు నమోదు చేశారు. కేసు నమోదు కావడంతో సాహిల్ దుబాయ్ వెళ్లాడు. అక్కడే ఉంటున్నాడు. అయితే, ఈ కేసుపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా సాహిల్ దుబాయ్ నుండి హైదరాబాద్ రావాల్సిందేనని.. పోలీసుల విచారణకు సహకరించాలని సాహిల్‌కు ఆదేజాలు జారీ చేసింది.
అసలేం జరిగిందంటే
గత డిసెంబర్ నెల 23వ తేదీన వేకువజామున 3 గంటల సమయంలో హైదరాబాద్ ప్రజా భవన్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రజా భవన్ ఎదుట ఉన్న ట్రాఫిక్ బారికేడ్లపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బారికేడ్లు పూర్తిగా ధ్వంసం కాగా వాహనం మితిమీరిన వేగానికి కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు ఆగగానే అందులో నుంచి ఒకరు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వాహనంలో ఉన్న మిగిలినవారిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం నిందితులను పంజాగుట్ట పీఎస్‌కు తరలించారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే షకిల్ కుమారుడు సాహిల్ ఈ విధ్వంసం సృష్టించినట్లు తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు పై విధంగా స్పందించింది. దీంతో, కోర్టు ఆదేశాలతో సాహిల్ దుబాయ్ నుంచి హైదరాబాద్ రానున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment