
సాక్షి, హైదరాబాద్: వంద శాతం ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటు చేశామని, బల్దియాకు రూ.428 కోట్లు ఆదా అయిందని జీహెచ్‌ఎంసీ విద్యుత్ విభాగం గొప్పలు చెబుతోంది. కానీ.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నం ఉన్నాయి. వందశాతం వెలుగులు రికార్డుల్లో తప్ప క్షేత్రస్థాయిలో కనిపించని పరిస్థితి. బల్దియాకు వివిధ మాధ్యమాల ద్వారా అందే ఫిర్యాదుల్లో విద్యుత్ దీపాలవే అధికం. అయినా విద్యుత్ ఇంజినీర్లు పనులు సరిగా చేయరు. చాలామంది రోజూ ఆఫీసుకు కూడా రారు. ఒక్కరోజు ఆఫీసుకొస్తే.. తిరిగి ఇళ్లకు వెళ్లేముందు నాలుగైదు ఫిర్యాదులకు సంబంధించిన ఫొటోలను తీసుకొని.. వారం మొత్తం ఆ పనుల్లో నిమగ్నమైనట్లు మాయ చేస్తారు. రోజూ అటెండెన్స్ ఉండదు. బయోమెట్రిక్ అసలే ఉండదు. వచ్చిన రోజే అన్ని సంతకాలూ చేసుకుంటారు. ఇదేమని అడిగే వారికి ‘ఫీల్డ్‌లో’ అనే సమాధానం రెడీగా ఉంటుంది. వారి పైస్థాయిలోని వారూ ఆమ్యామ్యాలతో పట్టించుకోరనే ఆరోపణలున్నాయి.
లంచాలతోనే ఎంట్రీ..
►బల్దియాలో ప్రవేశించేందుకు మొదలయ్యే లంచాల పర్వం ఏటా కొనసాగింపులకు, ఇతరత్రా సందర్భాల్లో సాగుతుంది. సంబంధిత అధికారులను మచ్చిక చేసుకొని, చేయి తడిపితే పని ఈజీగా అవుతుంది. ఇది ఒకవైపు దృశ్యం కాగా, బల్దియాలో ఎల్‌ఈడీ పథకం నిర్వహిస్తున్న ఈఈఎస్‌ఎల్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ, వారికి మేలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
►ఈఈఎస్‌ఎల్ పేరుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినా.. గ్రేటర్‌లో సబ్‌లీజుకు న డిపిస్తున్నట్లు సమాచారం. నిబంధనల మేరకు 98 శాతం వెలుగులుంటేనే వారికి బిల్లులు చెల్లించాలి. కానీ.. ఆ మేరకు వీధుల్లో వెలుగులు లేకున్నా ‘సిమ్యులేషన్ల’తో బురిడీ కొట్టిస్తారు. డ్యాష్‌బోర్డులో వెలుగుతున్నట్లు చూపిస్తారు. అందుకుగాను అందాల్సిన వారికి ముడుపులు ఆందుతాయనే ఆరోపణలున్నాయి.
►ఇటీవల మరో కొత్త ఎత్తుగడ నేర్చుకున్నారు. ఉన్న లైట్లన్నీ వెలగవు. 98 శాతంగా చూపేందుకు కనెక్టెడ్, ఆన్, ఆఫ్‌ల పేరిట.. ఆన్ అయిన వాటిల్లోని శాతాన్ని పరిగణనలోకి తీసుకొని నిధుల చెల్లింపులు జరిగేలా చేస్తున్నట్లు తెలుస్తోంది. రాత్రివేళ అన్ని లైట్లు కనెక్ట్ కాకున్నా పట్టించుకునే వారే లేరు. వాస్తవ పరిస్థితుల్ని బట్టి ఆటోమేటిక్‌గా ఆన్, ఆఫ్‌లు కావాల్సి ఉన్నా ఆ ప్రక్రియ సాగడం లేదు. పట్టపగలే వెలిగేవి.. రాత్రుళ్లు వెలగనివి ఎన్నో.
►ఎక్కడికక్కడ అవసరమైనన్ని డెడికేటెడ్ లాడర్స్ లేవు. విద్యుత్‌విభాగంలో ఎలక్ట్రికల్ ఇంజినీర్లు పనిచేయాల్సి ఉండగా, మెకానికల్, టెలికామ్ విభాగాల వారు కూడా విధులు నిర్వహించడం బల్దియాలోనే సాధ్యం. మెకానికల్ వారికి భారీ జీతాలు చెల్లించేందుకు ఆడిట్ విభాగం నిరాకరించినా.. కొనసాగిస్తున్నారంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు.
►ఇక ఆయా ఉత్సవాలు.. తదితర సందర్భాల్లో ఏర్పాటు చేసే టెంపరరీ లైట్ల పేరిట మరో దందా. స్ట్రీట్‌లైట్ పోల్స్‌కే టెంపరరీ లైట్లు వేయాల్సిన అవసరం ఎందుకొస్తుందో అడిగే వారుండరు. టెండరులో పేర్కొన్న దానికంటే 60 శాతం లెస్‌గా వేసినా.. కాంట్రాక్టరు లాభపడుతున్నారంటే.. లైట్లు వేస్తారో , కాగితాల్లోనే చూపుతారో ఊహించుకోవచ్చు. కొన్ని విభాగాల్లోని వారు చేసే పనులే రూ.10లక్షల విలువ చేయకున్నా.. వేతనాల పేరిట ఏటా రూ.12 లక్షలకుపైగా చెల్లిస్తారు. ఇలా.. జీహెచ్‌ఎంసీ విద్యుత్ విభాగంలో బయటకు కనిపించని చీకటి దృశ్యాలెన్నో! ఎన్నెన్నో!!.
Comments
Please login to add a commentAdd a comment