సాక్షి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో జరిగిన గొడవల ప్రభావంతో మంగళవారం కూడా హైఅలర్ట్ కనిపించింది. పట్టణమంతా పోలీసు పికెటింగ్‌లు, పెట్రోలింగ్ వాహనాలు తప్ప జనాలెవరూ రోడ్లపైకి రాలేదు. దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, మెడికల్ షాపులు, కూరగాయలు, కిరాణా, ప్రైవేట్ ఆస్పత్రులు కూడా మూసే ఉన్నాయి. పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. దాదాపుగా అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. భారీగా బందోబస్తు కొనసాగినా, జనం రోడ్లపై కనిపించకపోయినా.. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయ సమీపంలో మంగళవారం ఉదయం మరో కారు దహనమైంది. ఇంటిముందు నిలిపి ఉంచిన కారుకు ఎవరో నిప్పంటించారు. పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఫైరింజన్‌ను రప్పించి మంటలు ఆర్పివేయించారు. దీంతో మళ్లీ ఏదో జరుగుతోందని ప్రజల్లో భయం కనిపించింది.
కొనసాగుతున్న విచారణ
భైంసాలోని జుల్ఫిగల్ గల్లీలో ఆదివారం రాత్రి బైకు సైలెన్సర్ విషయంగా మొదలైన గొడవ చినికి చినికి గాలివానగా మారిన విషయం తెలిసిందే. నిమిషాల్లోనే ఇరువర్గాల వారు గుమిగూడి పరస్పర రాళ్లదాడికి, హింసకు పాల్పడ్డారు. పోలీసులు త్వరగా స్పందించడంతో రాత్రి 10.30 గంటలకల్లా పరిస్థితి అదుపులోకి వచ్చింది. కానీ అప్పటికే జుల్ఫికర్ గల్లీ, సంజయ్ గాంధీ మార్కెట్, బస్టాండ్ ప్రాంతాల్లో ఆస్తి, వాహనాల విధ్వంసం జరిగింది. రెండు ఇళ్లు, రెండు ఆటోలు, రెండు ద్విచక్రవాహనాలు, ఐదు కార్లు దహనమయ్యాయి.
ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటికే సుమారు 14 మందిని అదుపులోకి తీసుకోగా.. మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రామగుండం సీపీ సత్యనారాయణ, ఇన్‌చార్జి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ పరిస్థితిని పర్యవేక్షించారు. ఘటనలో వాహనాలు దహనమైన బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ వారినుంచి ఫిర్యాదులు తీసుకుని, దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన గొడవల్లో ఎవరెవరి ప్రమేయం ఉందనేది ఆరా తీస్తున్నారు. నిఘా బృందాలు కూడా వివరాలు సేకరించే పనిలో ఉన్నాయి. ఇక రెవెన్యూ అధికారులు రెండోరోజు సైతం ఆస్తి నష్టం వివరాలను అంచనా వేస్తూ కనిపించారు.
కొనసాగిన ఆంక్షలు.. ఇంటర్నెట్ బంద్
భైంసా పట్టణం, పరిసర ప్రాంతాల్లో పోలీసు ఆంక్షలు కొనసాగాయి. పట్టణానికి వచ్చే అన్నిమార్గాల్లో, పట్టణంలోని గల్లీల్లోకి వెళ్లే రహదారుల్లో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. గల్లీల్లో ఉన్నవారిని బయటికి అనుమతించలేదు. బయటివారిని లోనికి వెళ్లనీయలేదు. వేరే ఊర్ల నుంచి వచ్చేవారిని పట్టణంలోకి రానివ్వలేదు. మొత్తంగా భైంసాలో ఏం జరుగుతోందో బయటి జనానికి అంతుచిక్కని పరిస్థితి ఉంది. వరుసగా రెండోరోజు సైతం ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. పోలీసు ఆంక్షలతో మంగళవారం సైతం భైంసా డిపో నుంచి బస్సులు బయటికి రాలేదు. పట్టణం నుంచి బయటికి వెళ్లేవారు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లాల్సి వచ్చింది. అత్యవసర సేవల్లో పాల్గొనే సిబ్బందికి సైతం ఎలాంటి పాసులు జారీ చేయక.. ఇబ్బంది పడ్డారు. భైంసా డివిజన్‌లో చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, బ్యాంకులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకూ ఇబ్బందులు తప్పలేదు. వారంతా భైంసాలో ఉంటూ ఊర్లలో విధులకు వెళ్లొస్తుంటారు.
తీవ్ర ఇబ్బందుల్లో జనం
పట్టణంలో పోలీసు ఆంక్షలు, దుకాణాలు మూసి ఉండటంతో జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని ఏరియాల్లో పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసరాలు అందక అల్లాడుతున్నారు. ముఖ్యం గా పట్టణం మధ్యలో ఉన్న ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఇక చాలా మంది వాటర్ ప్లాంట్ల నుంచి రక్షిత మంచినీటిని తెచ్చుకునేవి. ఇప్పుడు వాటర్ సరఫరా చేసే ఆటోలనూ అనుమతించకపోవడంతో నల్లా నీళ్లు తాగాల్సిన పరిస్థితి ఉంది.
ఎంపీని అడ్డుకున్న పోలీసులు
బాల్కొండ: చలో బైంసా నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న ఎంపీ సోయం బాపురావును నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం వేంపల్లి శివారులో పోలీసులు అడ్డుకున్నారు. ఆదిలాబాద్ వైపు వెళ్లేందుకు అనుమతి లేదని.. హైదరాబాద్‌లోని నివాసానికి తిరిగి వెళ్లాలని సూచించారు. దీంతో పోలీసులపై అసహనం వ్యక్తం చేసిన ఎంపీ.. కాసేపటికి వెనుదిరిగి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment