బాధితురాలికి చెక్ అందజేస్తున్న హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే
కుషాయిగూడ: న్యాయం కోసం కోర్టుకు వచ్చే కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే అన్నారు. కుషాయిగూడ పారిశ్రామికవాడలోని ఆఫెల్ భవనంలో కొత్తగా ఏర్పాటు చేసిన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ప్రిన్సిపల్ డ్రాస్టిక్ కోర్టుతో పాటు ఇతర కోర్టుల సముదాయాన్ని శనివారం ఆయన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కోర్టు అడ్మిమినిస్టేటివ్ జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. వినోద్‌కుమార్‌తో కలసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జస్టిస్ అరాధే మాట్లాడుతూ, సత్వర న్యాయం అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో ఒకటన్నారు. ఈ క్రమంలో న్యాయస్థానాలను ఆశ్రయించే కక్షిదారులకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. న్యాయవ్యవస్థ పనితీరు ప్రభావవంతంగా, సమర్థవంతంగా ఉన్నప్పుడే న్యాయస్థానాలపై విశ్వాసం పెరుగుతుందన్నారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రతినిధులు కోర్టులో మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించాలని చీఫ్ జస్టిస్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెషన్స్ జడ్జి బి.ఆర్. మధుసూదన్‌రావు, జిల్లా కలెక్టర్ డి.అమోయ్‌కుమార్, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, రాచకొండ సీపీ డి.ఎస్. చౌహాన్, రిజిస్ట్రార్ జనరల్ తిరుమలదేవి, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి రఘునాథ్‌రెడ్డి, మేడ్చల్– మల్కాజిగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. రామచంద్రారెడ్డి, సెక్రటరీ ఎం.రాజుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment