కేంద్ర కేబినెట్‌లో లభించిన బెర్త్
నగరం నుంచి ముగ్గురు ఎంపీల పోటీ
కిషన్‌రెడ్డికి రెండోసారి దక్కిన అవకాశం
లష్కర్‌లో వెల్లువెత్తుతున్న హర్షాతిరేకాలు
సికింద్రాబాద్: మోదీ నేతృత్వంలో ఆదివారం కొలువుదీరిన కేంద్ర ప్రభుత్వంలో గ్రేటర్‌కు మరోసారి ప్రాధాన్యం దక్కింది. ఇక్కడి నుంచి మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు ఎంపీలు మోదీ కేబినెట్‌లో బెర్తు కోసం పోటీ పడగా.. సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డిని మరోదఫా కేంద్ర మంత్రి పదవి వరించింది. కేంద్రంలో వరుసగా మూడుసార్లు ఏర్పడిన మోదీ సర్కారులో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి ప్రాధాన్యం లభించడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక 2014లో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన ప్రస్తుత హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయకు కేంద్ర సహాయమంత్రి పదవి దక్కింది. అప్పట్లో ఆయన మూడేళ్లపాటు కారి్మక, ఉపాధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కిషన్‌రెడ్డి రెండుమార్లు ఎంపీగా వరుస విజయాలు సాధించారు. 2019లో మొదటిసారి ఎంపీగా గెలిచిన కిషన్‌రెడ్డి మోదీ ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. రెండేళ్ల అనంతరం జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో సాంస్కృతిక, పర్యాటక శాఖ కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందారు. ఎంపీగా రెండో విజయాన్ని నమోదు చేసుకున్న ఆయన తాజాగా మరోసారి నరేంద్ర మోదీ కేబినెట్‌లో కొలువుదీరారు.
ఇద్దరితో పోటీపడి..
బీజేపీలో సహజంగా జోడు పదవులు ఉండవని చెబుతుంటారు. రెండేళ్లుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి జోడు పదవులను నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. ఒకసారి కేంద్ర మంత్రిగా పని చేసి.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో మోదీ కొత్త మంత్రివర్గంలో కిషన్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు ఎంపీలు పోటీపడ్డారు. మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ స్థానాల నుంచి ఎంపీలుగా గెలిచిన ఈటల రాజేందర్, విశ్వేశ్వర్‌రెడ్డిలు కేంద్ర మంత్రి పదవిని ఆశించారు. అయినప్పటికీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డికి మోదీ కేబినెట్‌లో స్థానం లభించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి మరో బీసీ ఎంపీకి సీనియారిటీ ప్రాతిపదికన కేంద్ర మంత్రి పదవి ఇస్తున్న క్రమంలో త్వరలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కిషన్‌రెడ్డి నుంచి తప్పించనున్నట్టు సమాచారం. కేంద్ర మంత్రి పదవి ఆశించి భంగపడ్డ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని అధిష్టానం అప్పగించనున్నట్టు తెలుస్తోంది.
కేంద్ర మంత్రులు అవుతారని..
మూడుసార్లు వరుసగా ఏర్పాటైన నరేంద్ర మోదీ ప్రభుత్వాల్లో సికింద్రాబాద్ ఎంపీలకు మంత్రి పదవులు లభించాయి. ఈ పరిణామం పట్ల సికింద్రాబాద్ ప్రాంత ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో బీజేపీలో దశాబ్దాలుగా అంకితభావంతో పని చేసి నేతలుగా బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డిలు పేరుప్రఖ్యాతులు సంపాదించారు. అద్వానీతో కలిసి దత్తాత్రేయ, మోదీతో కలిసి కిషన్‌రెడ్డి పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలోనే వీరిని ఎంపీలుగా గెలిపించుకుంటే కేంద్ర మంత్రులు అవుతారన్న ప్రచారాలను ఇక్కడి బీజేపీ నేతలు బలంగా చేస్తూ వస్తున్నారు. ఈ ప్రచారం కూడా ఇక్కడ బీజేపీ అభ్యర్థుల విజయానికి దోహదం చేస్తున్నాయి.
ఈటలకు తప్పని నిరాశ
మేడ్చల్: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని ఆయన అనుచరులు, రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ.. ఆయనకు నిరాశే ఎదురైంది. సికింద్రాబాద్, కరీంనగర్ ఎంపీలుగా గెలిచిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు కేంద్ర మంత్రులుగా చోటు దక్కడంతో కొంత నిరాశకు గురయ్యారు. తెలంగాణ ఉద్యమ కారుడిగా, మంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకమైన ముద్ర వేసి కీలక నేతగా ఆయన ఎదిగారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ఈటల బీజేపీలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ ప్రకటించడంతో ఈటల రాజేందర్ పేరు తెరపైకి వచి్చంది. కాగా.. రాష్ట్రంలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టింది. ఈటల రాజేందర్ గజ్వేల్, హుజురాబాద్ స్థానాల నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.
లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటి..
అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చెందడం, బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడంతో ఈటల మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యరి్థగా పోటీ చేసి గెలుపొందారు. కేంద్ర మంత్రి కావాలని ఆశించారు. ఈటల ఎంపీగా గెలవగానే ఆయనకు ఎన్నికల్లో ప్రచారం చేసిన ప్రధాన నాయకులందరూ మరుసటి రోజే ఢిల్లీకి తరలివెళ్లారు. తమ నాయకుడు మంత్రి అవుతున్నారని జోరుగా ప్రచారం చేశారు.
మీడియాలో సైతం ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి పదవి రేసులో ఉన్నారని కథనాలు ప్రసారమయ్యాయి. కాగా.. ఆదివారం ప్రధాని మోదీ కేబినెట్‌లో సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌లకు కేంద్ర మంత్రులుగా ప్రకటనలు రావడంతో ఈటల రాజేందర్ ఆశలు అడియాసలే అయ్యాయి. కాగా.. ఈటలకు బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment