హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మంతత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కాగ్నిజెన్స్‌లోకి తీసుకుంది. దీని ఆధారంగా.. మంత్రి కొండా సురేఖకు సమన్లు జారీ చేస్తూ తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. తన కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నాగార్జున దావా వేసిన విషయం తెలిసిందే.
చేసిన ఆరోపణలకుగానూ కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున వేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. వాదనల సందర్భంగా నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. నాగార్జునపై కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నారు. ఆ తర్వాత ‘ఎక్స్’లో క్షమాపణ కోరుతూ పోస్ట్ పెట్టారన్నారు.
ఎక్స్‌లో మంత్రి కొండా సురేఖ పెట్టిన పోస్టును ఆయన కోర్టు ముందు చదివి వినిపించారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని అశోక్‌రెడ్డి అన్నారు. కచ్చితంగా కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలు అని పేర్కొన్నారు. అంతకు ముందు.. కొండా సురేఖ తరఫు న్యాయవాది గురుప్రీత్ సింగ్.. ఆమె క్షమాపణలు చెప్పినట్లుగా కౌంటర్ దాఖలు చేశారు.
అయితే ఈ వ్యాఖ్యల వల్ల నాగార్జున కుటుంబం మానసికంగా ఎంతో కుంగిపోయిందని న్యాయవాది అశోక్ రెడ్డి వాదించారు. అంతకు ముందు.. నాగార్జున, ఆయన కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంటూ.. డిసెంబర్ 12న సురేఖను కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి: కొండా సురేఖకు ఇదొక గుణపాఠం కావాలి!
Comments
Please login to add a commentAdd a comment