సాక్షి, హైదరాబాద్ : కరోనా ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా వైద్యశాఖను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం నెలకొందని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వైద్య ఆరోగ్యశాఖను బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ఆ దిశగా పనిచేస్తున్నామని వెల్లడించారు. ఈటల రాజేందర్ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం గురువారం జరిగింది. ఈ భేటీలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. గత ఆరు నెలలుగా అందరూ ఇళ్ళకు మాత్రమే పరిమితమైతే ఆరోగ్యశాఖ మాత్రం ప్రజాసేవలో నిమగ్నం అయ్యిందని మంత్రి పేర్కొన్నారు. కరోనా లాంటి కష్టకాలంలో పనిచేసిన ప్రతి ఒక్క వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. (కోవిడ్ వేళ ప్రతి ఇల్లూ ఆయుర్వేద కేంద్రమే )
పరిస్థితి అదుపులోనే ఉంది : కేటీఆర్
ఇతర రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతుంటే ప్రస్తుతం మన రాష్ట్రంలో అదుపులో పరిస్థితి అదుపులోనే ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇది ముమ్మాటికి వైద్య ఆరోగ్యశాఖ కృషి ఫలితమే అని తెలిపారు. ఈటల రాజేందర్ నాయకత్వంలో వైద్యారోగ్యశాఖ ప్రజల్లో భరోసా నింపే విధంగా పనిచేస్తూ కరోనా నుంచి ప్రజలను కాపాడుతుందని పేర్కొన్నారు. గత ఆరు నెలలుగా వైద్యఆరోగ్యశాఖ అద్భుతమైన పనిచేసిందని ప్రశంసించిన మంత్రి ఇందులో భాగస్వాములైన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. రానున్న కాలంలో వైద్యశాఖను మరింత బలోపేతం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని కేటీఆర్ అన్నారు. ఈసారి సీజనల్ వ్యాధులు కూడా తగ్గాయని మాతా, శిశు మరణాల రేటు సైతం తగ్గిందని తెలిపారు. వివిధ రకాలైన వ్యాధుల పట్ల ప్రజల్లో బాగా అవగాహన పెరిగిందన్నారు. (ప్రాణం పోసిన ఎక్మో..)
Comments
Please login to add a commentAdd a comment