లొంగిపోయే ముందే శరీర భాగాలు కాల్చేసి.. | Police Remand Report Over Naveen And Hari Hari Krishna Incident | Sakshi
Sakshi News home page

లొంగిపోయే ముందే శరీర భాగాలు కాల్చేసి..

Published Tue, Feb 28 2023 2:50 AM | Last Updated on Tue, Feb 28 2023 2:57 PM

Police Remand Report Over Naveen And Hari Hari Krishna Incident - Sakshi

అబ్దుల్లాపూర్‌మెట్‌: తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడని ప్రాణ స్నేహితుడైన నవీన్‌ను దారుణంగా హత్య చేసిన హరిహరకృష్ణ రిమాండ్‌ రిపోర్ట్‌లో విస్తుపోయే అంశాలు వెల్లడయ్యాయి. హరిహరకృష్ణ లొంగిపోయిన తర్వాత వెల్లడించిన వివరాలు, తమ దర్యాప్తులో తేలిన అంశాలను పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. ఆ రిపోర్టుప్రకారం.. ప్రియురాలికి, తనకు అడ్డుగా ఉన్నాడన్న ఉద్దేశంతో నవీన్‌ను అంతం చేసేందుకు హరిహరకృష్ణ 3 నెలల ముందే ప్రణాళిక రచించాడు.

అందులో భాగంగానే మలక్‌పేటలోని ఓ దుకాణంలో కత్తిని కొనుగోలు చేశాడు. అదును కోసం ఎదురుచూస్తూ ఈ నెల 17న ప్లాన్‌ అమలుకు సిద్ధమయ్యాడు. ఇంటర్‌ మిత్రుల గెట్‌ టు గెదర్‌ ఉందని నవీన్‌ను పిలిచాడు. మధ్యాహ్నం దాకా ఇద్దరూ కలిసి తిరిగారు. సాయంత్రం పెద్దఅంబర్‌ పేటలోని వైన్స్‌ వద్ద మద్యం కొనుగోలు చేసి తాగారు.  

గొంతు నులిమి చంపి.. 
ఇద్దరూ మద్యం తాగాక హరిహరకృష్ణ ప్లాన్‌ ప్రకారం నవీన్‌ను ఔటర్‌ రింగ్‌రోడ్డు సమీపంలోకి తీసుకువచ్చాడు. ఈ క్రమంలోనే ప్రేమించిన యువతి విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న హరిహరకృష్ణ.. నవీన్‌ను గొంతు నులిమి హత్య చేశాడు. వెంట తెచ్చుకున్న కత్తితో నవీన్‌ మృతదేహంపై విచక్షణారహితంగా పొడిచాడు. తల, కాళ్లు, చేతులు, గుండె, పెదాలను కోసేశాడు.

ఆ భాగాలను ఓ సంచీలో వేసుకుని అర్ధరాత్రి వరకూ అక్కడే ఉన్నాడు. 18న తెల్లవారుజామున నవీన్‌ శరీర భాగాలున్న సంచీని తీసుకుని ఘటనా స్థలానికి దగ్గరలో ఉన్న తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి వద్ద చెట్ల పొదల్లో విసిరేశాడు. తర్వాత అదే గ్రామంలో ఉన్న స్నేహితుడు హాసన్‌ ఇంటికి వెళ్లాడు. స్నానం చేశాక నవీన్‌ను హత్య చేసిన విషయం అతడికి చెప్పాడు. దీనితో భయపడిన హాసన్‌ అక్కడి నుంచి వెళ్లిపోవాలనడంతో.. హరిహరకృష్ణ తన ప్రియురాలికి ఫోన్‌ చేసి, నవీన్‌ను హత్య చేసిన విషయాన్ని చెప్పాడు. ఆమె నమ్మకపోవడంతో నవీన్‌ శరీర భాగాల ఫొటోలను ఆమెకు వాట్సాప్‌లో పంపించాడు. దీనిపై ఆందోళన చెందిన ప్రియురాలు.. పోలీసులకు లొంగిపోవాలని సూచించింది. 

పారిపోయి.. తిరిగొచ్చి కాల్చేసి.. 
నవీన్‌ ఆచూకీ కోసం అతడి కుటుంబ సభ్యు ల నుంచి ఒత్తిడి పెరగడంతో.. హరిహరకృష్ణ ఫోన్‌ స్విచాఫ్‌ చేసి హైదరాబాద్‌ నుంచి వెళ్లిపోయాడు. వరంగల్, కోదాడ, ఖమ్మం, విశాఖపట్నం ప్రాంతాలకు వెళ్లి వారం తర్వాత తిరిగి వచ్చాడు. నేరుగా బ్రాహ్మణపల్లికి వెళ్లాడు. చెట్ల పొదల్లో విసిరేసిన నవీన్‌ శరీర భాగాలతోకూడిన బ్యాగును బయటికి తీసి, దహనం చేశాడు.

అనంతరం అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు హరిహరకృష్ణను తీసుకెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. 25న హయత్‌నగర్‌ మేజిస్ట్రేట్‌ ముందు నిందితుడిని హాజరుపర్చి.. రిమాండ్‌ కోసం చర్లపల్లి జైలుకు తరలించారు. 

హరిహరకృష్ణ కస్టడీ కోసం పోలీసుల పిటిషన్‌ 
నవీన్‌ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణను విచారించేందుకు 8 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు మొదట హయత్‌నగర్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి హత్యకేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదవడంతో.. పోలీసుల పిటిషన్‌ను రంగారెడ్డి జిల్లా సెషన్స్‌ కోర్టుకు బదిలీ చేశారు. దీనిపై కోర్టు మంగళవారం నిర్ణయం తీసుకోనుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement