సజ్జల మొబ్బన్న (ఫైల్)
నందికొట్కూరు: కర్నూలు జిల్లాకు చెందిన మహా బలశాలి సజ్జల మొబ్బన్న (72) అనారోగ్యంతో గురువారం రాత్రి కన్నుమూశారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలంలోని నాగటూరు ఆయన స్వగ్రామం. మొబ్బన్న బరువులు ఎత్తడంలో తనకు తానే సాటి. సంద, గుండు, ఇరుసు ఎత్తడంలో మొనగాడని పేరుంది. ఆయన యుక్త వయసులో ఉన్నప్పుడు తొలుత గ్రామాల్లో జరిగే తిరుణాళ్లలో ప్రదర్శనలిచ్చేవారు. భారీ బరువులను అలవోకగా ఎత్తి అందర్నీ ఆశ్చర్య పరిచేవారు. పేద కుటుంబంలో పుట్టిన మొబ్బన్న జీవనాధారం వ్యవసా యం.
తనకున్న రెండెకరాల పొలాన్ని ఎద్దులు లేకుండా ఆయనే దుక్కి దున్నేవారని గ్రామస్తులు చెబుతారు. బరువులు ఎత్తడంలో ఆయన అసా మాన్య ప్రతిభను గుర్తించిన గ్రామస్తులు ప్రోత్సహించడమే కాకుండా ఆయన ఆహారానికయ్యే ఖర్చును సైతం గ్రామస్తులే పెట్టుకుని పోషించారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ పోటీల్లో పాల్గొన్నా మొబ్బన్నకు తిరుగుండేది కాదు. ఏకంగా 360 కిలోల గుండు ఎత్తి రికార్డు సృష్టించారు. ఐదు పదుల వయస్సు వచ్చే వరకు మొబ్బన్న అనేక పోటీల్లో పాల్గొన్నారు. ఆవిధంగా ఇప్పటివరకు 960 వెండి పతకాలు, 60 బంగారు పతకాలు సాధించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment