Telangana: Govt Plans To Fill Jobs, Five Stages In Gurukul Recruitment - Sakshi
Sakshi News home page

భారీగా గురుకుల పోస్టుల భర్తీ.. దరఖాస్తు విధానం ఇదే! ఇకపై ఐదు అంచెల్లో

Published Thu, Apr 13 2023 10:06 AM | Last Updated on Thu, Apr 13 2023 4:26 PM

Telangana: Govt Plans To Fill Jobs Five Stages In Gurukul Recruitment - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఐదు అంచెల్లో సాగనుంది. ఇందుకోసం తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (బీటీఆర్‌ఈఐఆర్‌బీ) ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించింది. బోర్డు ఒకేసారి 9 నోటిఫికేషన్లు జారీ చేసి 9 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టిన నేపథ్యంలో.. ఒక అభ్యర్థి తన అర్హతల మేరకు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

దీంతో అభ్యర్థి ఆన్‌లైన్‌లో ప్రతిసారి దరఖాస్తు సమయంలో వివరాలను సమర్పించాల్సిన అవసరం లేకుండా వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్‌) ప్రక్రియను తీసుకొచ్చింది. గతంలో కేవలం ప్రిన్సిపాల్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మాత్రమే ఓటీఆర్‌ పూర్తి చేయాల్సి ఉండేది. తాజాగా తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సరీ్వస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) మోడల్‌ను అనుసరిస్తూ ప్రతి అభ్యర్థికీ ఓటీఆర్‌ను తప్పనిసరి చేసింది.

పెద్ద సంఖ్యలో దరఖాస్తులొస్తాయనే అంచనాతో.. 
సుదీర్ఘ కాలం తర్వాత గురుకుల బోర్డు భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు జారీ చేయడంతో, దరఖాస్తులు కూడా పెద్ద సంఖ్యలో వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు ప్రక్రియ సులభతరంగా ఉండేందుకు బీటీఆర్‌ఈఐఆర్‌బీ ఐదు అంచెల పద్ధతి అనుసరిస్తోంది. దరఖాస్తు చేయాలనుకున్న అభ్యర్థి ముందుగా బోర్డు వైబ్‌సైట్‌ను తెరిచి ఆన్‌లైన్‌ అప్లై అనే ఆప్షన్‌ ద్వారా పేజీ తెరిచి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాలి.

తొలుత ఓటీఆర్‌ పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత అభ్యర్థికి యూజర్‌ ఐడీ, పాస్‌ వర్డ్‌ తయారవుతుంది. అనంతరం ఆ వివరాలతో లాగిన్‌ అయ్యాక పరీక్ష ఫీజును చెల్లించాలి. ఆ తర్వాత ఎంపిక చేసుకున్న పోస్టుకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌ దరఖాస్తు పత్రంలో పూరించి సబ్మిట్‌ చేయాలి. చివరగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ అయిన దరఖాస్తును డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రింట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు పత్రం అత్యంత కీలకం. ఉద్యోగానికి ఎంపికైన సమయంలో ఈ దరఖాస్తు పత్రం అవసరమవుతుందని అధికారులు చెబుతున్నారు. 

వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్ ప్రారంభం
బీటీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్‌సైట్‌లో ఓటీఆర్‌ ప్రక్రియ బుధవారం నుంచి అందుబాటులోకి వచి్చంది. ఈ నెల 17వ తేదీ నుంచి వివిధ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఓటీఆర్‌ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని స్పష్టం చేసింది. ఆధార్‌ కార్డు నంబర్‌ ద్వారా ఓటీఆర్‌ ఫారాన్ని తెరిచి, వివరాలను నమోదు చేసి, సంబంధిత ధ్రువపత్రాలను కూడా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. కాగా బుధవారం తొలిరోజు అభ్యర్థులు పెద్ద ఎత్తున వెబ్‌సైట్‌ను తెరిచారు. దీంతో వెబ్‌సైట్‌పై ఒత్తిడి పెరిగి పేజీ తెరుచుకోవడంలో తీవ్ర జాప్యం జరిగినట్లు తెలిసింది. దీంతో బోర్డుకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అనంతరం అధికారులు చర్యలు చేపట్టడంతో సాయంత్రానికి వెబ్‌సైట్‌ కాస్త స్పీడందుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement