సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలు ఈ నెల 26న వెల్లడించే అవకాశాలున్నాయి. పదవ తరగతి పరీక్షా ఫలితాలను ఈ నెల 30లోగా విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటర్ ఫలితాల వెల్లడికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నుంచి బోర్డు అధికారులు అనుమతి కోరినట్టు తెలిసింది. ఫలితాల ప్రకటనపై ట్రయల్ రన్ చేస్తున్న అధికారులు, ఈ ప్రక్రియ ఒకటి రెండురోజుల్లో పూర్తవుతుందనే ధీమాతో ఉన్నారు.
తొలుత ఈ నెల 25న ఫలితాల వెల్లడిపై అధికారులు ఆసక్తి చూపారు. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళినట్టు సమాచారం. మూల్యాంకనం తర్వాత మార్కులను కంప్యూటర్ ద్వారా ఫీడ్ చేశారు. ఈ క్రమంలో తప్పులు దొర్లినట్టు అధికారులు గమనించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సగటు ఫలితాల విశ్లేషణలో ఎక్కువ మొత్తంలో తేడా ఉన్నట్టు తెలియడంతో కలవరపడ్డారు. దీంతో మరోసారి సమగ్ర విశ్లేషణకు సిద్ధమయ్యారు.
టెన్త్ ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు..
టెన్త్ పరీక్ష ఫలితాలు ఈ నెల 30 నాటికి వెల్లడిస్తామని పరీక్షల విభాగం ఉన్నతాధికారి తెలిపారు. మూల్యాంకన ప్రక్రియ పూర్తయిన తర్వాత, సాంకేతికపరమైన అన్ని విషయాలను త్వరగా ముగించేందుకు ప్రయత్నిస్తున్నామని, డీకోడింగ్ తర్వాత వివిధ సబ్జెక్టుల మార్కుల క్రోడీకరణ జరిగిందని వివరించారు. వీటిని మరోసారి సమ గ్రంగా పరిశీలించి తుది నిర్ణయానికి వస్తామని పేర్కొన్నారు. అనుకున్న సమయానికి ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
పొరపాట్లు దొర్లనివ్వొద్దు: మంత్రి
వివరాలన్నీ తెలుసుకున్న మంత్రి ఆలస్యమైనా పర్వాలేదని, అన్నీ పరిశీలించిన తర్వాతే ఫలితాల విడుదలకు సిద్ధమవ్వా లని అధికారులకు సలహా ఇచ్చినట్టు తెలిసింది. గత ఏడాది కోవిడ్ నేపథ్యంలో ఫస్టియర్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం అతి తక్కువగా (49%) రావడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. విద్యార్థుల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. దీంతో కనీస మార్కులతో అందరినీ పాస్ చేయాల్సి వచ్చింది.
ఇప్పుడు కూడా కోవిడ్ తీవ్రత మధ్యే విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఇలాంటి సమయంలో పొరపాట్లు దొర్లి ఉత్తీర్ణతలో తేడా వస్తే విద్యార్థులు తీవ్ర ఆందోళనకు దిగే అవకాశం ఉందని అధికారులకు మంత్రి సూచించినట్టు తెలిసింది. నిశితంగా పరిశీలించి అన్నీ బాగున్నాయని నిర్థారించుకుంటే ఈ నెల 26వ తేదీన ఫలితాల వెల్లడికి సిద్ధం కావాలని చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా ఫలితాల క్రాస్ చెక్‌పై సీరియస్‌గా దృష్టి పెట్టిన అధికారులు 24వ తేదీ లోగానే దీన్ని పూర్తి చేసుకుని, 25న మంత్రిని మరోసారి కలిసే అవకాశం ఉందని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. 26వ తేదీన ఫలితాల వెల్లడికి కృషి చేస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment