గచ్చిబౌలి (హైదరాబాద్): ఫోర్జరీ డాక్యుమెంట్లతో హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)కు బురిడీ కొట్టించాలనుకున్న టీవీ–5 సాంబశివరావుకు బుర్ర తిరిగిపోయే ఎదురుదెబ్బ తగలింది. పచ్చ మీడియాలో ఒకటైన టీవీ–5లో సాంబశివరావు కీలకంగా వ్యవహరిస్తుంటాడన్న సంగతి తెలిసిందే. కాగా భూ యజమానికి తెలియకుండా నకిలీ పత్రాలతో హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఆయ న నడిపిస్తున్న పెట్రోల్ బంక్‌ను హెచ్‌పీసీఎల్ ప్రతినిధులు బుధవారం సీజ్ చేశారు.
ఫోర్జరీ సంతకాలతో ప్లాట్‌ను అగ్రిమెంట్ చేసుకొని, దాన్ని హెచ్‌పీసీఎల్‌కు లీజుకు ఇచ్చాడని ప్లాట్ యజమాని సరనాల శ్రీధర్‌రావు హెచ్‌పీసీఎల్‌కు చేసిన ఫిర్యాదులో తెలిపారు. దీంతో కంపెనీ అధికారులు రంగంలోకి దిగారు. ఫోర్జరీ చేసిన స్థలానికి బుధవారం కంచె వేయడంతో పాటు పెట్రోల్ బంక్‌ను పాక్షికంగా సీజ్ చేశారు. ఆ స్థలంలో ఉన్న పెట్రోల్ పంపులను మూసి వేశారు.
ఆయిల్ సంస్థలతో మంచి సంబంధాలున్నాయని నమ్మించి..
సాంబశివరావుపై ఇటీవల మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సరనాల శ్రీధర్ భార్యకు శేరిలింగంపల్లిలోని మాదాపూర్ గ్రామం, సర్వే నంబరు–64, హుడా టెక్నో ఎన్‌క్లేవ్, సెక్టార్– 3లోని ప్లాట్ నంబరు–26లో 600 చదరపు మీటర్ల (717.60 చదరపు గజాలు) స్థలం ఉంది.
2018లో సాంబశివరావు వీరిని కలిసి, తనకు ఆయిల్ సంస్థలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయని హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంక్ డీలర్‌షిప్ ఇప్పిస్తామని నమ్మించాడు. ప్లాట్‌కు సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా నకిలీపత్రాలు సృష్టించి ఫోర్జరీ సంతకాలతో భూ యజమానులకు తెలియకుండా పెట్రోల్ బంక్ డీలర్‌షిప్‌ను డాక్టర్ కొల్లి సౌమ్య పేరు మీదకు సాంబశివరావు బదలాయించాడు.
జర్నలిస్టులు, పోలీసుల పేరుతో భయపెట్టి..
తన స్థలంలో అక్రమంగా పెట్రోల్ బంక్‌ను నడుపుతున్నట్లు తెలుసుకున్న శ్రీధర్‌రావు షాక్‌కు గురయ్యారు. 2021లో దీనిపై సాంబశివరావును నిలదీశారు. దీంతో సాంబశివరావు ఎదురుదాడికి దిగాడు. హెచ్‌పీసీఎల్‌తో డీలర్‌షిప్ అగ్రిమెంట్‌కు ఒప్పుకోవాలంటూ ఒత్తిడి చేశాడు. రాజకీయ నాయకులు, జర్నలిస్ట్‌లు, పోలీసు అధికారులతో తనకున్న పరిచయాలను ప్రస్తావిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో భయభ్రాంతులకు గురైన శ్రీధర్‌రావు ఆ డీలర్‌షిప్‌ను తమ పేరు మీదకు బదలాయించాలని కోరారు.
లక్షల్లో వసూలు చేసి డీలర్‌షిప్ బదలాయించకుండా..
అయితే కొంత నగదు చెల్లిస్తేనే డీలర్‌షిప్‌ను బదలాయిస్తానని సాంబశివరావు చెప్పాడు. వేరే దారిలేక 2021, మార్చిలో రూ.లక్షల్లో నగదు బదలాయించామని శ్రీధర్‌రావు పోలీసులకు చేసిన ఫిర్యాదులో తెలిపారు.
అయినప్పటికీ డీలర్‌షిప్‌ను బదలాయించకపోవడంతో ఈ ఏడాది జనవరి 31న శ్రీధర్‌రావు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెచ్‌పీసీఎల్ ప్రతినిధులకు సైతం శ్రీధర్‌రావు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన హెచ్‌పీసీఎల్ అధికారులు సాంబశివరావు నడుపుతున్న పెట్రోల్ బంక్‌ను సీజ్ చేశారు. చీటింగ్ కేసును నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment