దీవించు ‘మామ’! | - | Sakshi
Sakshi News home page

దీవించు ‘మామ’!

Published Fri, Jul 14 2023 1:18 AM | Last Updated on Fri, Jul 14 2023 7:34 AM

- - Sakshi

సూళ్లూరుపేట: ప్రకృతిలో వస్తున్న మార్పులకారణంగా చందమామ విస్తీర్ణం తగ్గుతూ వస్తోందని, చంద్రుని చుట్టు కొలత విస్తీర్ణం 10,921 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉందని నాసా శాస్త్రవేత్తలు గతంలోనే గుర్తించారు. చంద్రుడు భూమికి దూరంగా జరిగి వెళుతున్నాడని, ఏడాదికి సుమారు 15 అంగుళాల దూరం వెళుతున్నాడని కూడా వెల్లడించారు. వీటిన్నింటినీ పరిశోధన చేయడానికి ఎన్నో దేశాల శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. భారత్‌ శాస్త్రవేత్తలు 2008లో చంద్రయాన్‌–1 ప్రయోగంలో ఆర్బిటర్‌ అనే ఉపగ్రహాన్ని చంద్రుడి చుట్టూరా పరిభ్రమించేలా చేసి చంద్రుడికి రెండోవైపున నీటి జాడలున్నాయని కనుగొన్నారు.

చంద్రయాన్‌–1లో అమర్చిన ‘మూన్‌ ఇంఫాక్ట్‌ ప్రోబ్‌’ అనే పేలోడ్‌ చంద్రునిపై నీటి జాడలున్నాయని ఛాయాచిత్రాలను కూడా తీసి పంపించింది. 2019లో ప్రయోగించిన చంద్రయాన్‌–2లో ల్యాండర్‌, రోవర్‌ ఆఖరి నిమిషంలో చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొని సిగ్నల్స్‌ ఆగిపోయాయి. కానీ ఆర్బిటర్‌ మాత్రం ఇప్పటికీ చంద్రుని కక్ష్యలోనే పరిభ్రమిస్తోంది. చంద్రుడికి రెండోవైపు నీటి జాడలున్న విషయాన్ని కనుగొనడమే కాకుండా ఆ నీళ్లు పలచగా ఉన్నాయని కూడా తెలియజేసింది. చంద్రయాన్‌–3 ప్రయోగంలో మరిన్ని పరిశోధనలు చేసి అత్యంత విలువైన సమాచారాన్ని సేకరించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.

చంద్రుడిపై 125 ప్రయోగాలు
ప్రపంచంలో అంతరిక్ష ప్రయోగాలు చేసే దేశాలు ఇప్పటికి దాకా 125 ప్రయోగాలు చంద్రుడిపైనే చేశాయని ఐక్యరాజ్యసమితి వెల్లడిస్తోంది. 1958 నుంచి అమెరికా చంద్రుడిపై పరిశోధనలను ప్రారంభించింది. 12 ప్రయోగాలు చేసిన తర్వాత 13వ ప్రయోగంలో చంద్రుని కక్ష్యలోకి చేరుకున్నారు. అమెరికా మొత్తంగా 58 ప్రయోగాలు చేసి అందులో 41 ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది. 1969లో అపోలో రాకెట్‌ ద్వారా నీల్‌ ఆర్మస్ట్రాంగ్‌, ఎడ్విన్‌ ఆల్ర్డ్‌న్‌, మైఖేల్‌ పోలీన్స్‌ అనే ముగ్గురు వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించిన ఘనత అమెరికా పేరు మీదే ఉంది.

రష్యా 1958 నుంచి 53 ప్రయోగాలు చంద్రునిపై చేయగా.. అందులో 35 విజయవంతమయ్యాయి. 1990 నుంచి జపాన్‌ ఆరు ప్రయోగాలు సొంతంగా, ఒక ప్రయోగం నాసాతో కలిసి చేయగా.. అందులో 5 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. 2010 నుంచి చైనా ఏడు ప్రయోగాలు చేయగా అందులో ఒక్క ప్రయోగాన్ని మాత్రమే చంద్రుని దాకా తీసుకెళ్లగలిగింది. ఇజ్రాయిల్‌ 2019 ఫిబ్రవరిలో చంద్రునిపైకి ల్యాండర్‌ను పంపించినా అది విజయవంతం కాలేదు. జర్మనీ 2003లో చంద్రుని మీదకు ఆర్బిటర్‌ను విజయవంతంగా పంపించింది.

2008లో భారత్‌ చంద్రుడిపైకి చంద్రయాన్‌–1 పేరుతో ఆర్బిటర్‌ ప్రయోగించి మొదటి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకుంది. అమెరికా, రష్యా, జపాన్‌, చైనా, జర్మనీ, ఇజ్రాయిల్‌, భారత్‌ చంద్రుడిపై పరిశోధనలకు ప్రయోగాలు చేసినప్పటికీ అమెరికా, రష్యా లాంటి అగ్రరాజ్యాలు ఇప్పటికీ పోటీపడుతున్నాయి. తాజాగా భారత్‌ కూడా అగ్రరాజ్యాలతో పోటీపడుతూ మూడో సారి ప్రపొల్షన్‌ మాడ్యూల్‌ ద్వారా ల్యాండర్‌ను చంద్రుని ఉపరితలంపై దింపి అందులో అమర్చిన రోవర్‌తో చంద్రుడిపై పరిశోధనలు చేసే స్థాయికి చేరింది.

చంద్రుడు, అంగారకుడు మీదకు రోవర్లు పంపిన దేశాలు పెద్ద బాల్స్‌లో రోవర్లను అమర్చి పంపాయి. భారత్‌ మాత్రం ల్యాండర్‌ ద్వారా రోవర్‌ను చందమామపై దించే మొట్టమొదటి దేశంగా ఖ్యాతి గడించనుంది. భవిష్యత్‌లో చంద్రుడిపైకి మానవుడ్ని పంపించేందుకు ఇదే తరహాలోనే చేసే అవకాశం లేకపోలేదు.

చంద్రయాన్‌ ప్రాజెక్టులకు రూ.1,600 కోట్లు
చంద్రయాన్‌–1, చంద్రయాన్‌–2 రెండు ప్రాజెక్టులకు కలిపి రూ.978 కోట్లు వ్యయం చేశారు. చంద్రయాన్‌–3 ప్రయోగానికి సుమారు రూ.615 కోట్లు వ్యయం చేస్తున్నారు. చంద్రయాన్‌–3లో ప్రపొల్షన్‌ మాడ్యూల్‌, ల్యాండర్‌, రోవర్‌లను పంపిస్తున్నారు కాబట్టి దీన్ని త్రీ ఇన్‌ ఒన్‌ ప్రయోగంగా ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చంద్రయాన్‌–3 ప్రయోగం విజయవంతం కావాలని యావత్‌ భారతదేశం ఆకాంక్షిస్తోంది.

భూమ్మీద నివసించే అందరూ చందమామను ముద్దుగా మామ అని పిలుచుకుంటారు. చంద్రుడికి పురాణాలు, ఇతిహాసాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించారు. ప్రతి పౌర్ణమి రోజున ఎంతో అందంగా కనిపించే చంద్రుడి గర్భంలో దాగి ఉన్న విశేషాలు, వింతలను తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. గడిచిన 60 ఏళ్లలో అనేక రకాల పరిశోధనలు చేయగా.. అందులో కొన్ని విజయవంతంకాగా.. మరికొన్ని విఫలమయ్యాయి. భారత్‌ శాస్త్రవేత్తలు మొదటి ప్రయత్నంలోనే విజయభావుటా ఎగురవేసి ప్రపంచపటంలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ద్వితీయార్థంలో ఎదురైన సవాళ్లను అదిగమించి మూడో ప్రయోగానికి సిద్ధమయ్యారు. నేడు చేపట్టనున్న చంద్రయాన్‌–3 విజయవంతమయ్యే విధంగా నెలరాజు దీవించాలని భారతీయులు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement