రూటు తప్పె.. రాబడి తగ్గె..! | Sakshi
Sakshi News home page

రూటు తప్పె.. రాబడి తగ్గె..!

Published Mon, May 27 2024 4:25 PM

రూటు

● దారి మార్చిన ఆర్టీసీ సర్వీసులు ● తిరుపతి బస్టాండ్‌ నుంచి బైపాస్‌లో వెళుతున్న బస్సులు ● ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు ● పట్టించుకోని అధికారులు

తిరుపతి అర్బన్‌: జిల్లాల పునర్విభజనలో భాగంగా చిత్తూరు, తిరుపతి రెండు జిల్లాలు అయినప్పటికీ ఈ రెండు నగరాలకు ఉద్యోగం, వ్యాపారం నేపథ్యంలో అనుబంధం కొనసాగుతోంది. ఈ క్రమంలో నిత్యం వందలాది మంది తిరుపతి నుంచి చిత్తూరుకు, చిత్తూరు నుంచి తిరుపతికి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతి టూ చిత్తూరుకు రోజు 135 సర్వీసులు నడుస్తున్నాయి. ప్రధానంగా తిరుపతి నుంచి బెంగళూరుకు 65 సర్వీసులు చిత్తూరు మీదుగా వెళుతాయి. అంతేకాకుండా తిరుపతి నుంచి రాయవేలూరుకు 20 సర్వీసులు, తిరుపతి నుంచి చిత్తూరుకు 50 సర్వీసులు తిప్పుతున్నారు. అన్నీ సర్వీసులు రోజు ఫుల్‌గానే ఉంటాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే తిరుపతి నుంచి చిత్తూరుకు వెళ్లే సర్వీసులు రైల్వే స్టేషన్‌, న్యూబాలాజీ కాలనీ, ఎస్వీ యూనివర్సిటీ మీదుగా నడుస్తుంటాయి. మరి కొన్ని సర్వీసులు లీలామహల్‌, కపిలతీర్థం, అలిపిరి, ఎస్వీ యూనివర్సిటీ మీదుగా చిత్తూరు నడపాల్సి ఉంది. ఇంకొన్ని సర్వీసులు ఎయిర్‌ బైపాస్‌ రోడ్డు,అన్నమయ్య సర్కిల్‌, ఎంఆర్‌పల్లె కూడలి మీదుగా ఎస్వీ యూనివర్సిటీ నుంచి చిత్తూరుకు వెళ్లాల్సి ఉంది. ఈ మార్గాల్లో బస్సులు వెళితే తిరుపతి నగరంలోని అన్ని ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు చిత్తూరుకు వెళ్లేందుకు వీలుగా ఉంటుంది. జన సంచారం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతాల మీదుగా వెళ్లడంతో ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఆర్టీసీ వారు ఏళ్ల తరబడి ఆయా మార్గాల మీదుగా బస్సులు నడుపుతున్నారు.

మార్గం మార్చారు

అయితే అలా వెళ్లకుండా బస్టాండ్‌ నుంచి రామానుజ సర్కిల్‌ మీదుగా తిరుచానూరు మామిడికాయల మండీ మార్గం మీదుగా బైపాస్‌పై వెళ్లిపోతున్నారు. బస్టాండ్‌లో 20 శాతం టిక్కెట్లు ఎక్కించుకుని ఇలా అడ్డదారిలో నడుపుతున్నారు. సాధారణంగా బస్టాండ్‌లో ప్రతి సర్వీస్‌కి 20 నుంచి 25 శాతం ప్రయాణికులు ఎక్కుతారు. మిగిలిన వారు బజారులో ఎక్కడంతో ఎస్వీ యూనివర్సిటీ ప్రాంతానికి వెళ్లే సమయానికి 100 శాతం ప్రయాణికులతో బస్సు ఫుల్‌ అవుతుంది. అయితే తిరుచానూరు మామిడికాయల మండీ మీదుగా వెళ్లడం ద్వారా కేవలం 20 నుంచి 25 శాతం మంది ప్రయాణికులతో ఆర్టీసీ సర్వీసులు నడపాల్సి ఉంటుంది. దీంతో ఆర్టీసీ ఆదాయానికి గండి పడడంతోపాటు తిరుపతి నగరంలోని ప్రయాణికులకు పెద్ద ఎత్తున ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అంతా ఆర్టీసీ బస్టాండ్‌కు రావాల్సి వస్తోందని వాపోతున్నారు. తిరుచానూరు బైపాస్‌ మీదుగా ఆర్టీసీ సర్వీసులు వెళ్లడం ద్వారా ట్రాఫిక్‌ లేకుండా వెళ్లిపోవచ్చునని ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు భావిస్తున్నారు. అయితే ప్రయాణికుల సౌకర్యాన్ని గుర్తించడం లేదు. మరోవైపు తిరుచానూరు బైపాస్‌ మీదుగా వెళ్లడానికి వీలులేదు. అయితే ఆర్టీసీ నిబంధనలకు విరుద్ధంగా పలువురు వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు.

నిఘా పెడతాం

చిత్తూరు మీదుగా వెళ్లే సర్వీసులు బస్టాండ్‌ నుంచి బజారులోనే ఎస్వీ యూనివర్సిటీ మీదుగా వెళ్లాల్సి ఉంది. బస్టాండ్‌లో ప్రయాణికులతో ఫుల్‌ అయినప్పటికీ బజారులోనే వెళ్లాలి. అంతేతప్ప తిరుచానూరు బైపాస్‌లో వెళ్లడానికి లేదు. మరోసారి అన్ని సర్వీసులపై నిఘా పెడుతాం. డ్రైవర్లు, కండక్టర్లుకు స్పష్టంగా తెలియజేస్తాం. ఆయా డిపో మేనేజర్లకు సమాచారం అందిస్తాం. అయినప్పటికీ ఆర్టీసీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. – డీఆర్‌ నాయుడు,

అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌, తిరుపతి

రూటు తప్పె.. రాబడి తగ్గె..!
1/1

రూటు తప్పె.. రాబడి తగ్గె..!

Advertisement
 
Advertisement
 
Advertisement