నిర్లక్ష్యం జాతర.. ల్యాబ్‌లకు పాతర!
● ల్యాబ్‌ల్లో బూజు పట్టిన పరకరాలు, రసాయనాలు ● కొన్ని కళాశాలల్లో కాగితాలకే పరిమితం ● 15 కళాశాలలకు నోటీసులు ● ఫిబ్రవరి 10 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు ● నిధులకు కోత విధించిన కూటమి సర్కార్
తిరుపతి ఎడ్యుకేషన్ : ప్రయోగాలు కొత్త విషయాలను నేర్పుతాయి. కొత్త ఆవిష్కరణలకు తోడ్పడుతాయి. దీనికోసమే చిన్నతనం నుంచే విద్యార్థులకు ప్రయోగాలతో కూడిన విద్యాబోధనను అందిస్తున్నారు. గణితం, సైన్స్‌కు సంబంధించిన పాఠ్యాంశాలు వంద శాతం విద్యార్థులకు అర్థం అవ్వాలంటే ప్రయోగాలు తప్పనిసరి. ముఖ్యంగా ఇంటర్మీడియెట్‌లో చేరిన సైన్స్, మ్యాథ్స్ విద్యార్థులకు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే తప్పనిసరిగా ప్రయోగాలు చేయించాల్సి ఉంది. అయితే చాలా వరకు కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు ప్రయోగం కడు దూరమవుతున్నాయి.
నామమాత్రం
ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు థియరీ, పోటీ పరీక్షలకు ఇస్తున్న ప్రాధాన్యత ప్రాక్టికల్స్‌కు ఇవ్వడం లేదన్నది జగమెరిగిన సత్యం. కొన్ని కళాశాలల్లో ల్యాబ్‌లు కాగితాలకే పరిమితమయ్యాయి. ల్యాబ్‌లున్న కళాశాలల్లో అధిక భాగం ప్రయోగాలు చేయించడం లేదు. ఇక కొన్ని కళాశాలు విద్యార్థులతో నామమాత్రంగా ప్రాక్టికల్స్ చేయించి చేతులు దులుపుకుంటున్నాయి. ప్రాక్టికల్స్ పరీక్ష దగ్గర పడుతుండడంతో కొన్ని కళాశాలలు హడావుడిగా విద్యార్థులను ల్యాబ్‌లకు తీసుకెళ్లి ప్రాక్టికల్స్‌ను తూతూమంత్రంగా చేయిస్తున్నట్లు తెలుస్తోంది.
బూజు పట్టిన పరికరాలు
ఇంటర్ ఒకేషనల్ విద్యార్థులకు ఫిబ్రవరి 5 నుంచి 20వ తేదీ వరకు, జనరల్ విద్యార్థులకు ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్స్ పరీక్షలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఆయా కళాశాలలకు బోర్డు నుంచి సమాచారం చేరింది. ఈ నేపథ్యంలో బోర్డు అధికారులు కళాశాలల్లో ల్యాబ్‌ల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కార్పొరేట్, ప్రైవేటు కళాశాలల్లో ల్యాబ్‌లు నామమాత్రంగా ఉన్నట్లు గర్తించారు. చాలా కళాశాలల్లోని ల్యాబ్‌ల్లో ఉన్న రసాయనాలు, స్పెసిమన్లు అలమరాలకే పరిమితమవ్వగా, పరికరాలు బూజు పట్టి ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థులతో ఎటువంటి ప్రయోగాలు చేయించడం లేదని తనిఖీల్లో గుర్తించడంతో ఆయా కళాశాలలకు నోటీసులను జారీచేశారు.
అటకెక్కిన బోర్డు నిబంధనలు
బోర్డు నిబంధనల మేరకు మొదటి సంవత్సరం నుంచే విద్యార్థులతో ప్రాక్టికల్స్ చేయించాల్సి ఉంది. ప్రాక్టికల్స్‌కు ప్రత్యేకంగా పీరియడ్లను కేటాయించాలి. అయితే కార్పొరేట్, ప్రైవేటు కళాశాలలు ఆ నిబంధనలకు పాతరేసింది. ప్రాక్టికల్స్ చేయించకుండా విద్యార్థులతో రికార్డులతో సరిపెట్టిస్తోంది. ప్రాక్టికల్స్ పీరియడ్లను థియరీ, జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు వినియోగిస్తోంది. అయితే ఇలాంటి కళాశాలలపై చర్యలు తీసుకునే వెసులుబాటు అధికారులకు లేకపోవడంతో చూస్తూ మిన్నుకుండిపోతున్నారు.
నిధులకు కోత
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో ప్రయోగాల నిర్వహణకు ఏటా రూ.30 వేల నుంచి రూ.50వేల వరకు నిధు లు విడుదల చేసేది. దీంతో ఆయా కళాశాలల్లో ప్రాక్టికల్స్‌ను నిర్వహించేవారు. అయితే కూటమి ప్రభుత్వం ప్రాక్టికల్స్‌కు ఇచ్చే నిధు ల్లో కోత విధించింది. ఈ విద్యాసంవత్సరం విద్యార్థి చెల్లించే రూ.2వేల ఫీజుతో పాటు అదనంగా రూ.400 ప్రయోగాలకు కేటాయిస్తోంది. వసూలు చేసిన మొత్తం ల్యాబ్‌ల్లో పరికరాలు, రసాయనాల కొనుగోలుకు సరి పోకపోవడంతో ఆయా కళాశాలల్లో అధ్యాపకులు ఇబ్బందులు పడుతున్నారు. అరకొర గా ప్రయోగాలు చేయించి సరిపెట్టేస్తున్నారు.
నోటీసులు జారీచేశాం
ఇంటర్ బోర్డు నిబంధనల మేరకు తప్పనిసరిగా ప్రాక్టికల్స్ తరగతులను మొదటి ఏడాది నుంచే నిర్వహించాలి. అందుకు అనుగుణంగా ల్యాబ్‌లు, పరికరాలు, రసాయనాలు ఏర్పాటుచేసుకోవాలని విద్యాసంవత్సరం ప్రారంభంలోనే అన్ని కళాశాలలకు ఉత్తర్వులు ఇచ్చాం. ఇటీవల ప్రాక్టికల్స్ తరగతుల నిర్వహణపై జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాం. ప్రాక్టికల్స్ చేపట్టని సుమారు 15 కళాశాలలకు నోటీసులు, నామమాత్రంగా చేయిస్తున్న కళాశాలల ప్రిన్సిపాళ్లకు హెచ్చరికలు జారీచేశాం. – జీవీ.ప్రభాకర్‌రెడ్డి, ఇంటర్ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి(ఆర్‌ఐఓ), తిరుపతి
Comments
Please login to add a commentAdd a comment