
ఎస్వీ హైస్కూల్‌లో అత్యుత్తమ విద్య
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర హైస్కూల్‌లో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్నట్లు అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. శ్రీ వేంకటేశ్వర ఉన్నత పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా గురువారం సాయంత్రం తిరుమలలో టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి విద్యార్థులు, అధ్యాపకులతో తన జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ చాలాకాలం తర్వాత ఇలాంటి కార్యక్రమానికి హాజరు కావడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీవారి పాదాల చెంత టీటీడీ పాఠశాలలో చదువుకుంటున్న మీరంతా ఎంతో అదృష్టవంతులన్నారు. అనంతరం వివిధ పోటీ పరీక్షలు, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, పతకాలను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారి విజయలక్ష్మి, అకడమిక్ ఇన్‌చార్జ్ రంగలక్ష్మి, హెచ్‌ఎం సురేంద్ర, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.