
ప్రభుత్వ భూములు అమ్మేస్తున్న తిరుపతి రూరల్ ఎమ్మార్వో
● కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు ● ఆధారాలతో సమర్పించిన ప్రజాప్రతినిధులు ● విచారణకు జేసీని ఆదేశించిన కలెక్టర్
తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండల పరిధిలోని ప్రభుత్వ భూములను అక్రమార్కుల చేతుల్లోకి చేర్చి అవినీతికి పాల్పడుతున్న తిరుపతి రూరల్ తహసీల్దారు రామాంజులు నాయక్‌పై విచారణ జరిపించాలని తిరుపతి రూరల్ మండల ప్రజాప్రతినిధులు సోమవారం జిల్లా కలెక్టర్‌ను కోరారు. తిరుపతి రూరల్ ఎంపీపీ మూలం చంద్రమోహన్ రెడ్డి, వైస్‌ఎంపీపీలు మాదవరెడ్డి, యశోద, జెడ్పీటీసీ సభ్యురాలు రత్నమ్మలతో పాటు పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు సోమవారం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్‌ను కలిశారు. తిరుపతి రూరల్ మండలం తహశీల్దారు రామాంజులు నాయక్ అండగా నిలబడడంతో తరతరాలుగా కాపాడుకుంటూ వచ్చిన భూములన్నీ అక్రమార్కుల పరం అవుతున్నాయని ఫిర్యాదు చేశారు. అనంతరం ఎంపీపీ మూలం చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తిరుపతి రూరల్ తహశీల్దారుగా రామాంజుల నాయక్ వచ్చినప్పటి నుంచి ఆక్రమణదారుల చెంతకు చేరిన ప్రభుత్వ భూములు, మఠం, భూములు, ఇనాం భూములు, కాలువ భూములు, చెరువు భూముల వివరాలను ఆధారాలతో సహా కలెక్టర్‌కు అందజేశామని తెలిపారు. భూ ఆక్రమణలకు సంబంధించి ఎవైనా తహసీల్దార్‌కు సమాచారం ఇస్తే వారి వివరాలను క్షణాల్లో ఆక్రమణదారులకు అందుతున్నాయంటే ఆయన ఏరకంగా వారితో ఆక్రమణదారులతో లాలూచీ పడ్డారో అర్థం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ భూముల దురాక్రమణలపై పత్రికల్లో ప్రచురించిన కథనాలు ప్రతులను కూడా కలెక్టర్‌కు అందజేశామని తెలిపారు. భూ ఆక్రమణదారులతో బేరం పెట్టి వసూళ్లకు పాల్పడుతున్నట్టు సాక్ష్యాలు కూడా ఆధారాలు కూడా వున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నట్టు చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి తహశీల్దారుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ప్రజలందరితో కలసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరాహార దీక్షలు చేపట్టడానికి సిద్ధంగా వున్నట్టు తెలిపారు. పది రోజుల సమయం తరువాత ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధమవుతున్నట్టు చెప్పారు. ఫిర్యాదు స్వీకరించిన కలెక్టర్ పూర్తిస్థాయి విచారణకు జిల్లా జాయింట్ కలెక్టర్‌కు ఆదేశిస్తున్నట్టు తెలిపారన్నారు. విచారణ తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్టు తెలిపారు.