నోటీసుల జారీకి ఆదేశం | - | Sakshi
Sakshi News home page

నోటీసుల జారీకి ఆదేశం

Published Thu, Apr 10 2025 1:29 AM | Last Updated on Thu, Apr 10 2025 1:29 AM

నోటీస

నోటీసుల జారీకి ఆదేశం

తిరుపతి రూరల్‌: మదర్‌ డెయిరీ యాజమాన్యానికి వెంటనే నోటీసులు జారీ చేయాలని, వ్యర్థాలను బయటకు వదిలితే చర్యలు తప్పవని హెచ్చరించాలని ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదేశించారు. తిరుపతి రూరల్‌ మండలం గాంధీపురం పంచాయతీలోని మదర్‌ డెయిరీ నుంచి వెలువడుతున్న వ్యర్థాల కారణంగా భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని, చుట్టు పక్కల నివాసముంటున్న ప్రజలు దుర్వాసనతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. దీనిపై ఈనెల7వ తేదీన ‘కలుషితం.. భూగర్భ జలం..’ శీర్షికతో సాక్షి పత్రికలో కథనం ప్రచురితమైంది. దీనిపై ఎమ్మెల్యే స్పందించారు. బుధవారం మండల పరిషత్‌ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. మదర్‌ డెయిరీ నుంచి అవిలాల చెరువులోకి వ్యర్థాలు రాకుండా చూడాలని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు కూడా లేఖ పంపించాలని ఎంపీడీఓ రామచంద్రను ఆదేశించారు. పాల పదార్థాలతో రూ.కోట్ల వ్యాపారం సాగించే డెయిరీ యాజమాన్యానికి ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే హక్కు లేదని స్పష్టం చేశారు.

కలెక్టర్‌తో ఐఐటీ డైరెక్టర్‌ భేటీ

తిరుపతి అర్బన్‌ : రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటుతో సరికొత్త ఆవిష్కరణల దిశగా విద్యార్థులను ప్రోత్సహించవచ్చని తిరుపతి ఐఐటీ డైరెక్టర్‌ కేఎన్‌ సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఈ మేరకు కలెక్టరేట్‌లో కలెక్టర్‌క వెంకటేశ్వర్‌ను కలిసి చర్చించారు. తిరుపతి ఐఐటీ స్పోక్‌ హబ్‌గా సేవలందిస్తుందని వెల్లడించారు.

అటవీశాఖ అధికారికి జైలు

సూళ్లూరుపేట రూరల్‌ : మహిళా ఉద్యోగిని వేధించిన కేసులో అటవీశాఖ అధికారి వరప్రసాద్‌రావుకు మూడు నెలలు జైలు శిక్ష, 5వేలు జరిమానా విధిస్తూ సూళ్లూరుపేట ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌.అనిల్‌కుమార్‌ బుధవారం తీర్పునిచ్చారు. వివరాలు.. 2023లో దొరవారిసత్రం మండలం నెలపట్టు పక్షుల కేంద్రంలో ఎస్‌కే అస్మతున్నీసా అనే అటవీశాఖ మహిళా ఉద్యోగినితో వరప్రసాద్‌రావు అభ్యంతరకరంగా ప్రవర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రవర్తించడంతో దొరవారిసత్రం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు న్యాయమూర్తి విచారణ చేపట్టి నిందితుడిపై నేరం రుజువు కావడంతో శిక్ష విధించారు. ప్రాసిక్యూషన్‌ తరఫున కేసును అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కేజే ప్రకృతి కుమార్‌ వాదనలు వినిపించారు.

నేడు, రేపు ఏఎన్‌ఎంల ఉద్యోగోన్నతికి కౌన్సెలింగ్‌

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం) : జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో గ్రేడ్‌–3 ఏఎన్‌ఎం ఉద్యోగోన్నతికి సంబంధించిన తుది జాబితా ఎట్టకేలకు పూర్తయింది. గతేడాది ప్రారంభమైన జాబితా తయారీ ప్రక్రియ...పలు ఆరోపణల నడుమ బుధవారం సాయంత్రానికి పూర్తి చేశారు. 1000 మందిపైగా గ్రేడ్‌–3 ఏఎన్‌ఎం ఉంటే 307 మందితో ఈ జాబితా సిద్ధం చేశారు. గురు, శుక్రవారాల్లో ఉద్యోగోన్నతికి సంబంధించి కౌన్సెలింగ్‌ చిత్తూరు నగరంలోని కలెక్టరేట్‌లో నిర్వహించనున్నారు. డీఆర్‌ఓ సమక్షంలో కౌన్సెలింగ్‌ జరగనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. వీటిపై కొంతమంది మళ్లీ అభ్యంతరం తెలుపుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్‌లకు ఫిర్యాదు చేశామని అంటున్నారు. దీనిపై అధికారులు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

వరదయ్యపాళెం : తడ– వరదయ్యపాళెం రహదారిలో బుధవారం జరిగిన ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. వివరాలు.. బుచ్చినాయుడు కండ్రిగ మండలం వెస్ట్‌ వరత్తూరుకు చెందిన డి.విజయ్‌(17), గురువర్ధన్‌ అనే ఇద్దరు విద్యార్థులు ద్విచక్రవాహనంపై తడకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఉండగా రాచకండ్రిగ వద్ద ఆగి ఉన్న బస్సును ఢీకొన్నారు. దీంతో విజయ్‌ అక్కడికక్కడే మరణించాడు. గురువర్ధన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శ్రీసిటీ హైటెక్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ హరిప్రసాద్‌ తెలిపారు.

నోటీసుల జారీకి ఆదేశం 1
1/3

నోటీసుల జారీకి ఆదేశం

నోటీసుల జారీకి ఆదేశం 2
2/3

నోటీసుల జారీకి ఆదేశం

నోటీసుల జారీకి ఆదేశం 3
3/3

నోటీసుల జారీకి ఆదేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement