
● మామిడి ఎగుమతులపై 26 శాతం పన్ను విధించిన అమెరికా ● భా
మామిడి.. పండ్లలో రారాజు. మాధుర్యం..చక్కటి రుచి, సువాసనలో సాటిలేనిది చిత్తూరు మామిడి. జిల్లాలో పండే ఈ పంట ప్రపంచంలోనే పేరుగాంచింది. అందుకే ఇక్కడి మామిడి పలు విదేశాలకు ఎగుమతి.. కర్షకులకు బహుమతిగా ప్రసిద్ధి చెందింది. అయితే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడి పన్నుల విధానం.. స్థానిక పల్ప్ ఫ్యాక్టరీల నిర్వాహకులు సిండికేట్‌తో ధరలు పతనం తప్పదా? అన్న సందిగ్ధం నెలకొంది. ఈ క్రమంలో మన మామిడి వి‘ఫల’రాజుగా మిగిలేనా? లేక రాణించేనా? అన్న మీమాంస రైతుల్లో నెలకొంది. శుక్రవారం జరగనున్న ఉద్యానవన సదస్సులో ఏ మి జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.
పలమనేరు : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రైతులకు ప్రధాన ఆధారం మామిడి. ఇక్కడ 70 శాతం తోతాపురి తోటలున్నాయి. జిల్లాలోని మామిడి ఉత్పత్తుల్లో 60 శాతం మ్యాంగో పల్ప్ పరిశ్రమలకు వెళ్లగా 20 శాతం దాకా టేబుల్ వైరెటీలు విదేశాలకు ఏటా ఎగుమతి అవుతున్నాయి. ఈ ఎగుమతులపై గతంలో మామిడిపై కేవలం 5 శాతం మాత్రమే పన్నులుండేవి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న అధిక పన్నుల కారణంగా చిత్తూరు జిల్లా నుంచి ఎగుమతి అయ్యే మామిడిపై 26 శాతం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఇకపై ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యే 2.50 లక్షల టన్నుల మామిడిపై అధిక పన్ను ప్రభావం పడనుంది. గతేడాది సీజన్‌లో టన్ను రూ.28 వేలు వరకు ఉన్న ధరలు అమాంతం తగ్గుముఖం పట్టి టన్ను రూ.21 వేలకు చేరింది. దీంతో మామిడి రైతులకు గతేడాది నష్టాలు తప్ప లేదు. ఏటా సీజన్‌లో పల్ప్ యాజమాన్యాలు సిండికేట్ అయి ధరలను నియంత్రిస్తున్నట్లు మామిడి రైతులు ఆరోపిస్తున్నారు.
గతంలో అమెరికా పన్ను కేవలం 5 శాతమే..
జిల్లా నుంచి టేబుల్ రకాల మామిడి అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, బెహరైన్, నేపాల్, యూఏఈ దేశాలకు ఎగుమతులు జరిగేవి. ఎక్కువ శాతం యూఎస్‌ఏకు వెళ్లేది. గతంలో మామిడిపై పన్ను కేవలం 5 శాతం మాత్రమే ఉండేది. కానీ ట్రంప్ గద్దెనెక్కాక పన్నులను 26 శాతానికి పెంచేశారు. భారీగా పెరిగిన పన్నులు మామిడి ఎగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపడం ఖాయంగా కనిపిస్తోంది. ఎగుమతి పన్ను పెరిగినందున ఇక్కడి వ్యాపారులు స్థానిక మామిడి తక్కువ ధరకు కొనాల్సి వస్తుంది. దీంతో మామిడి రైతులకు నష్టాలు తప్పేలాలేవు.
ఇతర దేశాలపై దృష్టి సారించాలి
ఏటా ఇక్కడి నుంచి మామిడిని ఎగుమతి చేసే పలు దేశాల్లో పన్నులు తక్కువగా ఉన్న దేశాలకు ఎగుమతులను పెంచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు అమెరికాకు ప్రత్యామ్నాయంగా మారుతుంది.
పల్ప్ ఫ్యాక్టరీల సిండికేట్ దెబ్బ
జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రాల్లో 30 దాకా మామిడి గుజ్జు పరిశ్రమలున్నాయి. ఇక్కడ పండిన పంటలో 50 శాతం జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని జ్యూస్ ఫ్యాక్టరీలకు చేరుతుంది. మామిడి కాయలను పల్ప్ (మామిడి గుజ్జు) తయారు చేసి, ఇతర రాష్ట్రాలకే కాక విదేశాలకు సైతం ఎగుమతులు చేస్తుంటారు. ఏటా జూన్ తొలివారం నుంచి జులై తొలి వారం వరకు తోతాపురి సీజన్ ముగుస్తుంది. ఆపై ఆగస్టు తొలివారం వరకు నీలం లాంటి టేబుల్ రకాలతో ఇక్కడి సీజన్ అయిపోతుంది. అయితే ఏటా జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రాల పల్ప్ పరిశ్రమలు సైతం సిండికేట్‌గా మారి ధరలను తగ్గిస్తున్న విషయం ఏటా జరుగుతూనే ఉంది. దీంతో తోతాపురి రైతులకు ఏటా పండించిన మామిడికి గిట్టుబాటు దక్కకుండా పోతోంది.
నేడు చిత్తూరులో ఉద్యానవన సదస్సు
అమెరికా పన్నులు పెంచిన నేపథ్యం, స్థానికంగా పల్ప్ ఫ్యాక్టరీల సిండికేట్ వ్యవహారంపై నేడు జిల్లా కేంద్రంలో జరగనున్న ఉద్యానవన సదస్సుకు కలెక్టర్ , హార్టికల్చర్ శాఖ , చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్‌తో పాటు పలువురు మంత్రులు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, మామిడి రైతులు, వ్యాపారులు, పల్ప్ పరిశ్రమల నిర్వాహకులు హాజరు కానున్నారు.
మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలి
ఇప్పుడున్న పరిస్థితుల్లో మామిడి రైతుకు గిట్టుబాటు ధర టన్ను రూ.30 వేల దాకా ఉండాలి. ఏటా గుజ్జు పరిశ్రమల సిండికేట్‌తో ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తోతాపురి కాయలు కోతల కొచ్చే సమయంలో ఉన్నట్టుండి ధరలు తగ్గుముఖం పడితే రైతులకు తీవ్ర నష్టం వస్తుంది. దీనిపై ఉన్నతాధికారులు పల్ఫ్ పరిశ్రమ నిర్వాహకులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలి. – సుబ్రహ్మణ్యంనాయుడు, రామాపురం, పలమనేరు మండలం

● మామిడి ఎగుమతులపై 26 శాతం పన్ను విధించిన అమెరికా ● భా

● మామిడి ఎగుమతులపై 26 శాతం పన్ను విధించిన అమెరికా ● భా

● మామిడి ఎగుమతులపై 26 శాతం పన్ను విధించిన అమెరికా ● భా