టైటిల్: కలర్ ఫొటో
నటీనటులు: సుహాస్, చాందిని చౌదరి, సునీల్, వైవా హర్ష, తదితరులు
రచనా, దర్శకత్వం: సందీప్ రాజ్
సంగీతం: కాళ భైరవ
బ్యానర్: అమృత ప్రొడక్షన్&లౌఖ్య ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు: సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని
విడుదల: 23 అక్టోబర్ (ఆహా)
దసరా పండగకు కళకళలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలవెలబోయాయి. నువ్వానేనా అంటూ పోటీలో దిగే పెద్ద సినిమాలు ఈసారి పత్తా లేకుండా పోయాయి. కానీ ఓ చిన్న సినిమా మాత్రం దసరా బరిలో నిలిచింది. పడిపడి లేచే మనసు, మజిలీ, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాల్లో హీరో స్నేహితుడిగా కమెడియన్‌గా నటించిన సుహాస్ హీరోగా పరిచయమవుతున్న సినిమా కలర్ ఫొటో. తెలుగమ్మాయి చాందిని చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. యూట్యూబ్ వీడియోల ద్వారా పాపులర్ అయిన సందీప్‌రాజ్ తొలిసారిగా దర్శకుడి బాధ్యతలు ఎత్తుకున్నాడు. కానీ కథ మాత్రం సాయి రాజేష్ నీలం అందించారు. తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహాలో అక్టోబర్ 23న రిలీజైన ఈ చిత్రం వీక్షకుల మదిని క్లిక్‌మనిపించిందో లేదో చూసేద్దాం....
కథ
1997లో జరిగే కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ (సుహాస్) అనే కుర్రాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో కాలేజీలో కుర్రాళ్లు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మ(చాందినీ చౌదరి)ని తొలిచూపులోనే ప్రేమించేశాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మథనపడ్డాడు. కారణం.. నల్లగా ఉన్నాడని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరిముందు చితక్కొట్టడంతో దీపుకు పరిచయం ఏర్పడుతుంది.
కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్‌స్పెక్టర్ రామరాజు(సునీల్)కు ఈ ప్రేమాదోమా నచ్చదు. పైగా చెల్లెలిని మంచి అందగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇంతలో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ల ప్రేమకు శత్రువుగా మారతాడు. దీప్తికి తెలియకుండా అతడిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? జయకృష్ణ, దీప్తి పెళ్లి చేసుకున్నారా? లేదా తెలియాలంటే సినిమా చూడాల్సిందే..! (పెంగ్విన్ మూవీ రివ్యూ)
విశ్లేషణ
ప్రేమ ఒక సముద్రం. దానిపై వచ్చిన సినిమాలు అలలవంటివి. చిన్నా పెద్దా తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకుని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షను ఆధారంగా చేసుకొని మాత్రం సినిమాలు రాలేదనే చెప్పొచ్చు. దర్శకుడు సందీప్ రాజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యభరితమైన కథను ఎంచుకున్నారు. కామెడీ పండించే సుహాన్‌తో ఎమోషన్స్ పండించారు. కానీ ప్రేమకావ్యాన్ని రక్తికట్టించడంలో తడబడ్డారు.
కథను సూటిగా సుత్తి లేకుండా చెప్పలేకపోయాడు. ఫస్టాఫ్ మొత్తం హీరో వన్‌సైడ్ లవ్, సెకండాఫ్‌లో ప్రేమ పట్టాలెక్కడం, ఓ రెండు పాటలేసుకోవడం, వీరి ప్రేమకు హీరో అన్నయ్య అడ్డు చెప్పడం, దాడి చేయడం మళ్లీ పాత వాసనలే కనిపిస్తాయి. అయితే అమ్మాయిలు అందంగా ఉన్న అబ్బాయిలను మాత్రమే ప్రేమిస్తారు అనే అపోహను ఈ సినిమా పోగొట్టే ప్రయత్నం చేసింది. కుల మత ప్రాంతాలే కాదు వర్ణం కూడా ప్రేమ సాగరానికి ఆనకట్ట వేయలేదనే సందేశాన్ని అందించారు. (నా కలర్‌ఫొటోకు విలన్ సునీల్)
నటన
సుహాస్ తొలిసారి హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవమున్న నటుడిగానే కనిపిస్తారు. దీప్తి పాత్రలో చాందినీ చౌదరి సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయారు. కానీ ప్రేక్షకుడికి మాత్రం అతడిని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పూయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవా హర్ష కామెడీ ట్రాక్ నవ్విస్తుంది. కీరవాణి తనయుడు కాళ భైరవ అందించిన నేపథ్య సంగీతం, పాటలు బాగున్నాయి. (‘హిట్’ మూవీ రివ్యూ)
ప్లస్ పాయింట్స్:
సుహాస్ పరిపక్వత నటన
కథ
సంగీతం
మైనస్ పాయింట్స్
కథను సాగదీయడం
ప్రేమకథను మరింత లోతుగా, గాఢంగా చూపించలేకపోవడం
చివరి మాట: ప‌్రేమకు కలర్ కూడా అడ్డు కాదన్న మంచి సందేశాన్ని అందించారు. అందుకని దీన్ని అందమైన అనకుండా రమ్యమైన ప్రేమకథ అనేద్దాం..
Comments
Please login to add a commentAdd a comment