విద్యుదాఘాతంతో దుకాణం దగ్ధం | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో దుకాణం దగ్ధం

Published Sat, May 25 2024 5:10 PM | Last Updated on Sat, May 25 2024 5:10 PM

-

రూ.20 లక్షల వరకు ఆస్తినష్టం

చేవెళ్ల: ప్రమాదవశాత్తు షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి ఓ కిరాణా దుకాణం దగ్ధమైంది. ఈ సంఘటన మోకిల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి కొండకల్‌ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి మండలంలోని కొండకల్‌ గ్రామంలో గణపతిరెడ్డి కొన్నేళ్లుగా కిరాణ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. రోజు మాదిరిగానే గురువారం రాత్రి దుకాణం బంద్‌ చేసి ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు తెల్లవారుజామున దుకాణంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ అయి మంటలు చెలరేగాయి. ఈ విషయం గమనించి స్థానికులు గణపతిరెడ్డికి సమాచారం అందించారు. వెంటనే ఆయన అక్కడికి చేరుకొని స్థానికుల సహాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ మంటలు ఎక్కువగా వ్యాపించడంతో దుకాణం బూడి దయింది. దాదాపు రూ.20 లక్షల వరకు నష్టం జరిగిందని బాధితుడు వాపోయారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

స్పందించని ఫైర్‌ సిబ్బంది

ప్రమాదంపై స్థానికులు 101కి డయల్‌ చేశా రు. ఆ సమయంలో గచ్చిబౌలి, మాదాపూ ర్‌, పటాన్‌చెరు అగ్నిమాపక కేంద్రాలు శంకర్‌పల్లి మా పరిధి కాదంటూ కాలయాపన చేశారు. బాధితుడు, స్థానికులు కలిసి మంటలను ఆర్పివేసేందుకు ఇబ్బందులు పడ్డా రు. దీంతో ఫైర్‌ శాఖ నిర్లక్ష్యంపై స్థానికులు మండిపడ్డారు. అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పినా స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైర్‌ సిబ్బంది సకాలంలో స్పందిస్తే ఆస్తినష్టం తగ్గేదని బాధితుడు వాపోయారు.

బండ్లగూడ జాగీరు మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం

బండ్లగూడ: గండిపేట మండలం బండ్లగూడ జాగీరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ రెండో మేయర్‌గా లతాప్రేమ్‌గౌడ్‌ శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజేంద్రనగర్‌ ఆర్డీ వో వెంకట్‌రెడ్డి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. మొత్తం 21 మంది కార్పొరేటర్లకుగాను డిప్యూటీ మేయర్‌ పూలపల్లి రాజేందర్‌రెడ్డి సహా 17 మంది మున్సిపల్‌ కార్యాలయంలో జరిగిన మేయర్‌ ఎన్నిక సమావేశానికి హాజరయ్యారు. కార్పొరేటర్లు అందరూ లతాప్రేమ్‌ గౌడ్‌కు మద్దతు తెలపడంతో ఆమె మేయర్‌ పీఠాన్ని దక్కించుకున్నారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ బి.శరత్‌చంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కాగా, జనవరి 12న అప్పటి బీఆర్‌ఎస్‌ మేయర్‌ మహేందర్‌ గౌడ్‌పై కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్‌కు అవిశ్వాస నోటీసు ఇవ్వగా ఆయన హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. అనంతరం 17 మంది కార్పొరేటర్లు మార్చి 21న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మహేందర్‌గౌడ్‌ను తొలగించారు. బీఆర్‌ఎస్‌ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికై న లతాప్రేమ్‌గౌడ్‌ కాంగ్రెస్‌లో చేరి తాజాగా మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement