విచారణ.. అరెస్టులతో పోలీసులు బిజీ
అధికారులదీ అదే పరిస్థితి
పత్తి, ధాన్యం కొనుగోళ్లను పట్టించుకోని వైనం
వికారాబాద్: కొడంగల్ నియోజకవర్గం, దుద్యాల్ మండలం, లగచర్లలో అధికారులపై దాడి జరిగింది మొదలు జిల్లాలో పాలన అస్తవ్యస్తంగా తయారయ్యింది. ఇటు పోలీసులు.. అటు అధికారులు దాడి ఘటనపైనే దృష్టి సారించారు. ఇది జరిగి పది రోజులు దాటినా పాలన గాడిన పడలేదు. విచారణ.. అరెస్టుల పేరుతో పోలీసు యంత్రాంగం పరిగి, కొడంగల్, వికారాబాద్‌కే పరిమితమయ్యారు. ఉన్నతాధికారులు కూడా ఫార్మాసిటీ గ్రామాల్లోనే పర్యటిస్తున్నారు. దీంతో జిల్లాలో పాలన గాడి తప్పుతోంది.
కుటుంబ సర్వేపై ప్రభావం
ఈ నెల 9న ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియ ప్రారంభం కాగా.. మొదటి రెండు రోజులు అధికారులు హడావుడి చేశారు. ఎక్కడికక్కడ సర్వే ప్రక్రియను పరిశీలించి సూచనలు, సలహాలు ఇచ్చారు. 11వ తేదీ లగచర్లలో కలెక్టర్, ఇతర అధికారులపై దాడి జరగడంతో పరిస్థితి అదుపు తప్పిందనే చెప్పాలి. అధికారులు నిరసన బాట పట్టారు. మూడు రోజుల పాటు ప్రజలకు అందుబాటులో లేరు. పాలనపై దృష్టి పెట్టలేదు. పార్టీలు, నేతలు కలెక్టరేట్ బాట పట్టారు. నిత్యం పరామర్శలు, ఖండనలు చేస్తూనే ఉన్నాయి. మరో పక్క పోలీసు ఉన్నతాధికారులు విచారణ పేరుతో కలెక్టరేట్‌ను సందర్శించడం పరిపాటిగా మారింది. కుటుంబ సర్వేను అధికారులు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు లగచర్ల ఘటపై బిజీగా మారడంతో కలెక్టరేట్‌లో ఎవరూ అందుబాటులో ఉండటం లేదు. సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ప్రజలు అధికారుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది.
తూతూమంత్రంగా కొనుగోళ్లు
జిల్లాలో 5.80లక్షల ఎకరాల్లో వానాకాలం పంటలు సాగు చేశారు. ఇందులో సింహభాగం పత్తి, వరి పంటలే. పత్తి 2.5 లక్షల ఎకరాల్లో వేయగా, వరి 1.3లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ప్రస్తుతం ఈ రెండు పంటలు చేతికొచ్చాయి. ధాన్యం సేకరణకు ప్రభుత్వం 129 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. పత్తి కొనుగోలు కోసం 14 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే లగచర్ల ఘటన, కుటుంబ సర్వే ప్రక్రియలో కొంత మంది అధికారులు బీజీగా ఉండటంతో కొనుగోలు కేంద్రాల నిర్వహణను గాలికొదిలేశారు. దీంతో కేంద్రాల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తేమ, తాలు శాతం పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గన్నీ బ్యాగులు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు లగచర్ల ఘటన నుంచి బయట పడి పాలనపై దృష్టి సారించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment