చికిత్స పొందుతూ కూలీ మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ కూలీ మృతి

Published Mon, Jan 27 2025 7:07 AM | Last Updated on Mon, Jan 27 2025 7:07 AM

-

యాచారం: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ కూలీ మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం... ఒరిశా రాష్ట్రం నౌపాడ్‌ ప్రాంతానికి చెందిన భగబన్‌(42) కొద్ది నెలలుగా ఆకులామైలారం గ్రామ సమీపంలోని ఇటుక బట్టీలో కూలీగా పనిచేస్తున్నాడు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటుక బట్టీలో పనిచేసే తోటి కార్మికులు భగబన్‌ను శనివారం ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గ్రీన్‌ ఫార్మాసిటీ సీఐ లిక్కి కృష్ణంరాజు తెలిపారు.

యువతి అదృశ్యం

యాచారం: మండల పరిధిలో ఓ యువతి అదృశ్యమైన సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని నల్లవెల్లి గ్రామానికి చెందిన కావ్య(20) శనివారం మార్కెట్‌కు వెళ్లొస్తానని ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆదివారం సాయంత్రం కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నర్సింహారావు తెలిపారు.

నేటితో సమాప్తం

ముగిసిన మున్సిపాలిటీ పాలకవర్గం పదవీకాలం

ఇబ్రహీంపట్నం: ఐదేళ్ల పాటు అధికారంతో కళకళలాడిన మున్సిపాలిటీలు సోమవారంతో వెలవెలబోతున్నాయి. మున్సిపల్‌ పాలకవర్గ పదవీకాలం ముగుస్తుంది. 2020 జనవరి 22న మున్సిపల్‌ ఎన్నికలు జరగగా ఓట్ల లెక్కింపు 25న చేపట్టారు. 27న చైర్మన్లు, వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్లు పదవీ బాధ్యతలు తీసుకున్నారు. ఆదివారానికి పాలకవర్గ సభ్యులు బాధ్యతలు చేపట్టి ఐదేళ్లు పూర్తి కావడం గమనార్హం. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని పాలకవర్గం ప్రారంభం నుంచి పలువురు కౌన్సిలర్లు, చైర్‌ పర్సన్‌ కప్పరి స్రవంతిచందుపై అవిశ్వాసం పెట్టినా పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి పదవిని కాపాడుకుంది. ఆ కొద్ది రోజులకే వైస్‌ చైర్మన్‌ ఆకుల యాదగిరిపై కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టగా ఆయన పదవిని నిలుపుకోలేక పోయారు. అనంతరం జరిగిన వైస్‌ చైర్మన్‌ ఎన్నికలో బర్ల మంగయాదవ్‌ విజయం సాధించారు. దీంతో ఐదేళ్ల కాలంలో ఒక చైర్మన్‌, ఇద్దరూ వైస్‌ చైర్మన్లు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి పని చేశారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నో ఒడిదొడుకులను పాలకవర్గం ఎదుర్కొంది. అయితే అభివృద్ధి విషయంలో కొంత వెనుకబాటు కనిపించిందని స్థానికుల అభిప్రాయం. కాగా మున్సిపల్‌ ఎన్నికలను కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టకపోవడంతో మున్సిపాలిటీలు ప్రత్యేకాధికారుల పాలనలోకి వెళ్లనున్నాయి. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి ప్రత్యేకాధికారిగా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ నియమితులయ్యారు.

మళ్లీ వచ్చేవారెవరో

వచ్చే మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొంతమంది కౌన్సిలర్లు పోటీకి విముఖత చూపుతుండగా మరికొంత మంది సుముఖత వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్లు, ఆయా పార్టీల టికెట్ల కేటాయింపులను బట్టి భవిష్యత్తులో ఎంతమంది తిరిగి కౌన్సిల్‌లోకి అడుగుపెడుతారో వేచి చూడాలి. పదవీకాలం ముగియడంతో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని చైర్‌పర్సన్‌ స్రవంతి, వైస్‌ చైర్‌పర్సన్‌ మంగ, కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement