ఎనిమిదేళ్ల తర్వాత ఇంటికి | - | Sakshi
Sakshi News home page

ఎనిమిదేళ్ల తర్వాత ఇంటికి

Published Wed, Jan 29 2025 7:56 AM | Last Updated on Wed, Jan 29 2025 7:56 AM

ఎనిమిదేళ్ల తర్వాత ఇంటికి

ఎనిమిదేళ్ల తర్వాత ఇంటికి

● భర్తమృతి, ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు వదిలిన మహిళ ● హైదరాబాద్‌లో భిక్షాటన చేస్తూ జీవనం ● గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించిన సామాజిక కార్యకర్త

యాలాల: భర్త అకాల మరణం, కుటుంబ పోషణ ఎలా..? అనే సందిగ్ధంతో ఎనిమిదేళ్ల క్రితం ఇద్దరు పిల్లలు, కుటుంబ సభ్యులను వదిలి వెళ్లిన ఓ మహిళ నగరంలో భిక్షాటన చేస్తూ కాలం గడిపింది. ఆమెను గుర్తించిన కొందరు సోషల్‌ ఆర్గనైజింగ్‌ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో మంగళవారం పోలీసుల సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. యాలాల మండలం అచ్యుతాపూర్‌కు చెందిన వెంకటమ్మకు బొంరాస్‌పేట మండల కేంద్రానికి చెందిన చంద్రయ్యతో వివాహమైంది. వీరికి మారుతి, నరేశ్‌ ఇద్దరు సంతానం. వీరి చిన్నతనంలోనే భర్త చనిపోవడంతో వెంకటమ్మ తన ఇద్దరు పిల్లలను తీసుకొని అచ్యుతాపూర్‌లోని తల్లిగారింటికి వచ్చేసింది. కాగా ఇద్దరు పిల్లలను ఎలా సాకాలనే ఆలోచన, ఆర్థిక పరిస్థితులతో మానసిక వేదనకు గురై.. ఎవరికీ చెప్పకుండా ఎనిమిదేళ్ల క్రితం ఇంట్లోనుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, ఇరుగు, పొరుగు గ్రామాల్లో వెతికినా ఫలితం లేకుండా పోయింది.

భిక్షాటన చేస్తుండగా గుర్తు పట్టి..

ఎనిమిదేళ్ల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయిన వెంకటమ్మ నగరంలోని అత్తాపూర్‌లో రోడ్లపై భిక్షాటన చేస్తూ కాలం గడిపింది. కాగా ఇటీవల అచ్యుతాపూర్‌ గ్రామానికి కొందరు అత్తాపూర్‌లో వెంకటమ్మను చూసి గుర్తు పట్టారు. ఈ విషయాన్ని ఆమె పెద్దనాన్న కుమారుడైన (అన్న) అనంతయ్యకు చెప్పారు. సామాజిక కార్యకర్త వెంకటేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ దోర్నాల్‌ ఉపాధ్యక్షుడు బాల్‌రాజ్‌, మైనార్టీ నాయకుడు అహ్మద్‌ సాయంతో అనంతయ్య అత్తాపూర్‌ వెళ్లారు. పిల్లర్‌ నంబర్‌ 64 వద్ద భిక్షాటన చేస్తుండగా ఆమెను గుర్తు పట్టి కలిశారు. అనంతయ్యను గుర్తుపట్టిన వెంకటమ్మ తన కొడుకులు మారుతి, నరేశ్‌ను హత్తుకుని బోరున విలపించింది. కుటుంబ విషయాలు,గతంలోని జ్ఞాపకాలు, ప్రస్తుత పరిస్థితులను ఆమెతో చర్చించి సొంతూరుకు తీసుకెళ్లారు. యాలాల పోలీసుల సమక్షంలో మంగళవారం సాయంత్రం వెంకటమ్మను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎనిమిదేళ్ల తరువాత వెంకటమ్మ ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement